Nalgonda: ప్రైవేటు టీచర్ రూప రెడ్డి హత్య కేసును చేదించిన పోలీసులు!
Nalgonda: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు.
Nalgonda: ప్రైవేటు టీచర్ రూప రెడ్డి హత్య కేసును చేదించిన పోలీసులు!
నల్లగొండ: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో సంచలనం సృష్టించిన నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. పాఠాలు చెప్పిన టీచర్‌నే ఇద్దరు పదో తరగతి విద్యార్థులు హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. దోపిడీ కోసం పక్కా ప్లాన్‌తో హత్యకు పాల్పడిన ఇద్దరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ నెల 11న రూపారెడ్డి ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. కేసును సవాల్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.. దేవరకొండ డీఎస్పీ ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్ ఆధారాలు, ఫింగర్‌ప్రింట్స్, డాగ్ స్క్వాడ్, సీసీ కెమెరాలు, టెక్నికల్ అనాలసిస్‌తో దర్యాప్తు చేపట్టారు. సుమారు 30 కిలోమీటర్ల పరిధిలో 70కి పైగా సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి, 80 మందికి పైగా అనుమానితులను విచారించారు.
అయితే హత్యకు ముందు రూపారెడ్డి తన చిన్నమ్మతో ఫోన్‌లో మాట్లాడిన సమయంలో చివరిగా బాబు అని పలికారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఈ ఒక్క మాట పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది. రూపారెడ్డి పాఠశాలలో విద్యార్థులను సాధారణంగా “బాబు” అని పిలిచేవారని గుర్తించిన పోలీసులు దర్యాప్తును విద్యార్థుల వైపు మళ్లించారు.
ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు పదో తరగతి విద్యార్థులపై నిఘా పెట్టారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారాలతో అనుమానం మరింత బలపడింది. దొనియాల ఎక్స్‌రోడ్డు వద్ద బైక్‌పై వస్తున్న ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద రూ.1.54 లక్షల నగదు లభించింది. అందులో మూడు రూ.500 నోట్లపై రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
విచారణలో ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసి నగదు అపహరించినట్లు విద్యార్థులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరూ ఒకే హాస్టల్ గదిలో ఉంటూ సోషల్ మీడియా, యూట్యూబ్‌లో డబ్బులు సులభంగా సంపాదించే మార్గాల కోసం వెతికినట్లు దర్యాప్తులో తేలింది. గతంలో డబ్బుల విషయంలో ప్రిన్సిపల్ తమను మందలించడంతో ఆమెపై కక్ష పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.
హత్యకు వారం రోజుల ముందు నుంచే రెక్కీ నిర్వహించిన విద్యార్థులు.. ఘటన రోజున దుస్తులు మార్చుకుని కొండమల్లేపల్లిలో కత్తి, గ్లౌజులు కొనుగోలు చేశారు. ఇంటి వెనుక నుంచి లోపలికి ప్రవేశించి రూపారెడ్డిపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం బెడ్‌రూమ్‌లో ఉన్న నగదును తీసుకుని పరారయ్యారు.
నిందితుల నుంచి రూ.1.54 లక్షల నగదు, మృతురాలి ఐఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తి, గ్లౌజులు, మాస్కులు, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో ప్రతి చిన్న ఆధారాన్ని శాస్త్రీయంగా విశ్లేషిస్తూ సాంకేతిక పరిజ్ఞానంతో హత్య మిస్టరీని ఛేదించిన పోలీసు బృందాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.
రూపారెడ్డి హత్య కేసులో చివరిగా వినిపించిన బాబు అనే ఒక్క మాట.. పోలీసులకు కీలక క్లూగా మారింది. ఆ ఒక్క ఆధారంతో మొదలైన దర్యాప్తు.. చివరకు పాఠాలు చెప్పిన టీచర్‌ను హతమార్చిన విద్యార్థుల వరకు వెళ్లింది.




