Suryapet: నేరస్థులకు త్వరగా శిక్షలు పడేలా చూడాలి: సూర్యాపేట ఎస్పీ!
Suryapet: జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్టు డ్యూటీ పోలీసు సిబ్బందితో ఎస్పీ నరసింహ ఐపీఎస్ ప్రత్యేక సమీక్షా నిర్వహించారు. కేసుల్లో త్వరగా శిక్షలు పడేలా చూడాలన్నారు
Suryapet: నేరస్థులకు త్వరగా శిక్షలు పడేలా చూడాలి: సూర్యాపేట ఎస్పీ!
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం కోర్టు డ్యూటీ పోలీసు సిబ్బందితో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ సమావేశం నిర్వహించారు.
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుండి కోర్టు విధుల పర్యవేక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఈ సమావేశంలో ఎస్పీ పలు సూచనలు చేశారు.
కోర్టు విధుల్లో పనిచేసే సిబ్బంది నాణ్యత, పారదర్శకతతో పని చేయాలని, ఎలాంటి పనులు పెండింగ్‌లో ఉంచవద్దని స్పష్టం చేశారు. కోర్టు వారెంట్లు, సమన్లను సకాలంలో సంబంధిత వ్యక్తులకు అందజేయాలని ఆదేశించారు.
సిబ్బంది సమయపాలన పాటిస్తూ, కోర్టులతో సమన్వయంగా వ్యవహరించాలన్నారు. కేసుల స్థితిగతులను ఎప్పటికప్పుడు రికార్డులలో, అంతర్జాలంలో సరిగ్గా నమోదు చేయాలని సూచించారు. బాధితులు, సాక్షులు, నిందితులను సకాలంలో కోర్టుకు హాజరుపరిచి, కేసులను త్వరగా పరిష్కరించేలా చూడాలని తెలిపారు.
"కేసుల్లో నేరస్తులకు త్వరగా శిక్షలు అమలైతేనే క్షేత్రస్థాయిలో నేరాలను అదుపు చేయగలం" అని ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. లక్ష్యంతో పని చేయడంతో పాటు, కోర్టు అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డిసిఆర్బి డిఎస్పి రవి, ఇన్స్పెక్టర్ మగ్దూం అలీ, సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణతో పాటు జిల్లా వ్యాప్తంగా కోర్టు డ్యూటీ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




