Suryapet: స్థానిక సంస్థల ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించాలి: సిరిసిల్ల రాజయ్య
Suryapet: సూర్యాపేట కలెక్టరేట్‌లో తూర్పు తెలంగాణా ప్రాంతీయ స్థానిక సంస్థల సదస్సు.
Suryapet: స్థానిక సంస్థల ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించాలి: సిరిసిల్ల రాజయ్య
సూర్యాపేట: స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు.
సూర్యాపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో తూర్పు తెలంగాణా ప్రాంతీయ స్థానిక సంస్థల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి కాత్యాయని దేవి, సభ్యురాలు సుజానా యాదవ్, సభ్యుడు ఎస్.సుధీర్ రెడ్డితో కలిసి చైర్మన్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సిరిసిల్ల రాజయ్య, అనవసర వ్యయాన్ని తగ్గించుకుని ఆదాయ వనరుల ద్వారా రాబడిని పెంచుకున్నప్పుడే స్థానిక సంస్థలు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించగలవని, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. "గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం" అని గుర్తు చేస్తూ, గ్రామీణ ప్రజలను ప్రజాస్వామ్య పరిపాలనలో భాగస్వాములు చేస్తూ వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు పని చేయాలని పిలుపునిచ్చారు.
సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జిల్లాలో స్థానిక సంస్థల పనితీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, చెత్త సేకరణ, పచ్చదనం పెంపు, పన్ను వసూళ్లు, స్వయం ఉపాధి పథకాల అమలు, గ్రాంట్స్ ద్వారా వచ్చే ఆదాయం తదితర అంశాలపై చర్చించారు.
ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డులో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించడం, పారిశుధ్య నిర్వహణ పక్కాగా కొనసాగించడం కోసం నిశిత పర్యవేక్షణ చేయాలని చైర్మన్ ఆదేశించారు. ఇటీవల ఎన్నికైన సర్పంచ్‌లు, మేయర్లు, చైర్‌పర్సన్‌లు, కౌన్సిలర్లు మౌలిక సదుపాయాల మెరుగుదల, స్థానిక సంస్థల బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
నిధుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఆధారపడకుండా పన్ను వసూళ్లు, ప్రకటనల రాబడి, వృత్తి పన్ను, వ్యాపార సముదాయాల రుసుముల ద్వారా స్థానిక సంస్థలు ఆర్థిక పరిపుష్టి సాధించాలని సూచించారు. ఆదాయ వనరుల పెంపుపై ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి సలహాలు స్వీకరించిన చైర్మన్, వాటిని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.
ఆర్థిక అసమానతలు, సామాజిక వ్యత్యాసాలు తొలగి, మానవ సంపద సమాజానికి ఉపయోగపడేలా కృషి జరగాలని ఆయన అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలిచి సామాజిక అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన చర్యలపై ఫైనాన్స్ కమిషన్ నివేదిక ఇస్తుందని పేర్కొన్నారు.




