Suryapet: ఆకుపాముల జెడ్పీహెచ్ఎస్లో కలెక్టర్ తేజస్ పవార్ ఆకస్మిక తనిఖీ!
Suryapet: సూర్యాపేట జిల్లా ఆకుపాముల జెడ్పీహెచ్‌ఎస్‌ను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, మధ్యాహ్న భోజనం, విద్యా ప్రమాణాలను పరిశీలించారు.
Suryapet: ఆకుపాముల జెడ్పీహెచ్ఎస్లో కలెక్టర్ తేజస్ పవార్ ఆకస్మిక తనిఖీ!
సూర్యాపేట: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, విద్యాబోధన ప్రమాణాలు మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. శనివారం ఆకుపాముల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన ఆయన ఇంకుడు గుంతలు, టాయిలెట్లు, వంటగదిని పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. వారి చదువు, విద్యా ప్రమాణాలు, పరీక్షల సన్నద్ధత గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల చదువు తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. వంటగదిని కూడా సందర్శించి మధ్యాహ్న భోజనం తయారీ, నిర్వహణను పరిశీలించారు. పాఠశాలలోని సమస్యలు, అవసరమైన సదుపాయాల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
*విద్యాబోధనపై ప్రత్యేక దృష్టి*
పాఠశాలల్లో నిర్వహిస్తున్న తనిఖీల్లో భాగంగా ఫైనల్ ఇన్స్పెక్షన్ బృందంతో కలెక్టర్ సమావేశమై పలు సూచనలు చేశారు. ఉపాధ్యాయుల బోధనా పద్ధతులు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, లెర్నింగ్ అవుట్‌కమ్స్ ఆధారంగా పాఠాలు బోధిస్తున్నారా లేదా అనే అంశాలను పరిశీలించాలని సూచించారు. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వినియోగం, లెసన్ ప్లాన్లు, ఇయర్ ప్లాన్లు, టీచింగ్ డైరీల నిర్వహణను తనిఖీ చేయాలని తెలిపారు. వర్క్షీట్ల ద్వారా విద్యార్థులకు నిరంతరం అభ్యాసం కల్పించాలని సూచించారు.
ఉపాధ్యాయులు విద్యార్థులతో నిత్యం మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకోవాలని పేర్కొన్నారు. పాఠశాలలో స్టాఫ్ రూమ్ పైకప్పు శిథిలావస్థకు చేరి స్లాబ్ దెబ్బతిన్న విషయాన్ని ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యపై ఇప్పటికే ఎంపీడీఓకు దరఖాస్తు చేసినట్లు తెలిపారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నాణ్యమైన విద్య అందించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు.




