Suryapet: కోదాడ నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి

Suryapet: కోదాడ నియోజకవర్గ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌కు వినతిపత్రం ఇచ్చారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 15 Oct 2026 6:33 PM IST
Suryapet
X

Suryapet: కోదాడ నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి

సూర్యాపేట: కోదాడ నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, ఎండిపోతున్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కు వినతిపత్రం అందజేశారు.

వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోతున్నాయని, పంట నష్టంపై సమగ్ర సర్వే చేసి రైతులకు నష్టపరిహారం అందించాలని, ఉపాధి కోల్పోయిన రైతు కూలీలకు కరువు భత్యం ఇవ్వాలని వినతిపత్రంలో కోరారు.

అనంతరం కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. రైతులు అప్పులు చేసి పంటలు సాగు చేస్తే అవి కళ్లెదుటే ఎండిపోతుంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేదన్నారు.

రైతుబంధు, రైతు భరోసా, రుణమాఫీ హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని, వ్యవసాయ కూలీలకు నెలకు వెయ్యి చొప్పున 12 వేలు ఇస్తామన్న హామీ గాలికి కొట్టుకుపోయిందని ఆరోపించారు. ప్రభుత్వం విలాసాలకు, విదేశీ పర్యటనలకు వందల కోట్లు ఖర్చు చేస్తూ రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

కోదాడ నియోజకవర్గంలో వ్యవసాయ, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి తక్షణమే పరిహారం ప్రకటించాలని, కూలీలకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ తరఫున పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు శీలం సైదులు, నల్ల భూపాల్ రెడ్డి, జానకి రామాచారి, మాజీ జడ్పీటీసీ మునగాల కోల ఉపేందర్, అనంతల ఆంజనేయులు, ఏలూరు వెంకటేశ్వరరావు, ద్వారకుంట రమేష్ తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA