Suryapet: 2007 నాటి పాత కక్షలే కారణం.. సర్పంచ్ కొడుకే మాస్టర్ మైండ్!
Suryapet: సూర్యాపేట మండలం యర్కారం పరిధిలో సంచలనం రేపిన చింతపాటి మధు హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు.
Suryapet: 2007 నాటి పాత కక్షలే కారణం.. సర్పంచ్ కొడుకే మాస్టర్ మైండ్!
Suryapet: సూర్యాపేట మండలం యర్కారం పరిధిలో సంచలనం రేపిన చింతపాటి మధు హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. శనివారం యర్కారం గ్రామ శివారు కల్వర్టు కింద గోనె సంచిలో మృతదేహంగా లభించిన వ్యక్తిని చింతపాటి మధు(42)గా గుర్తించినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. మధు శుక్రవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో భార్య మౌనిక సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తొలుత మిస్సింగ్ కేసుగా నమోదు చేసి, మృతదేహం లభ్యం కావడంతో దాన్ని హత్య కేసుగా మార్చి 5 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు.
అద్దె ఇంట్లోనే హత్య
దర్యాప్తులో తాళ్లగడ్డ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లోనే హత్య జరిగినట్లు తేలింది. టేకుమట్ల సమీపంలో జాతీయ రహదారిపై ప్రధాన నిందితులు మిద్దె జీవన్, మిద్దె ఆనంద్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. 2007లో యర్కారం సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో మధు ప్రధాన నిందితుడు. అప్పటి నుంచి కక్ష పెంచుకున్న రవీందర్ కుమారుడు జీవన్ ప్రతీకారం తీర్చుకోవాలని పథకం వేసినట్లు పోలీసులు వెల్లడించారు. మధు బతికుంటే తనకు ప్రాణహాని అని భావించి హత్యకు కుట్ర పన్నాడు.
మందు పార్టీ పేరుతో పిలిచి..
ఈ హత్యలో జీవన్‌కు చింత సైదులు, మేదరి ప్రసాద్, మిద్దె ఆనంద్, కక్కిరేణి భరత్ సహకరించారు. శుక్రవారం మధును మందు పార్టీ పేరుతో తాళ్లగడ్డలోని అద్దె ఇంటికి పిలిపించారు. మద్యం మత్తులో ఉన్న సమయంలో మటన్ కత్తితో దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి కారులో యర్కారం శివారులో పడేశారు. బైకును మరోచోట, కత్తి-సెల్‌ఫోన్‌ను అడివేముల శివారులో పారేశారు.
నిందితుల వద్ద నుంచి ఒక కారు, ఒక బైక్, హత్యకు ఉపయోగించిన కత్తి, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని. 5 మందిని అరెస్ట్ చేయగా మరో మహిళా నిందితురాలు భవాని పరారీలో ఉంది. నిందితుల్లో కొందరిపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయి. హత్యలు, భౌతిక దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేసి త్వరగా శిక్షలు పడేలా చూస్తామని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. నిందితులను సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు హాజరుపరిచారు.




