Suryapet: సూర్యాపేట గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

Suryapet: సూర్యాపేట పరిధిలోని ఇమాంపేట గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్. విద్యార్థులతో కలిసి భోజనం.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 23 July 2026 8:25 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేట గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

సూర్యాపేట: సూర్యాపేట పరిధిలోని ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైన విద్య అందించాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. విద్యార్థులు ఉన్నత ఆశయాలతో చదివి భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని అన్నారు.

తనిఖీలో భాగంగా కలెక్టర్ ముందుగా కిచెన్ రూమ్, డైనింగ్ హాల్, వెజిటబుల్ రూమ్, బియ్యం, నిత్యావసర సరుకుల నిల్వ గదులను పరిశీలించారు. సరుకుల నిల్వ విధానం, పరిశుభ్రత, నిర్వహణ తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. కూరగాయలు, సరుకులను వెలుతురు తగిలేలా ఎత్తైన ప్రదేశంలో భద్రపరచాలని, గుడ్లను ఎక్కువ కాలం నిల్వ చేయకుండా అవసరానికి అనుగుణంగా స్టాక్ ఉంచాలని తెలిపారు. వంటశాల, భోజనశాల పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

అనంతరం పదవ తరగతి గదిని సందర్శించిన కలెక్టర్ విద్యార్థులకు స్వయంగా హిందీ పాఠాన్ని బోధించారు. విద్యార్థులతో మమేకమై పాఠ్యాంశాలపై అవగాహన కల్పించారు. కంప్యూటర్ ల్యాబ్, ప్లేగ్రౌండ్‌ను కూడా పరిశీలించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యతో పాటు క్రీడలు, కంప్యూటర్ పరిజ్ఞానంలోనూ అభివృద్ధి సాధించేలా ప్రోత్సహించాలని సూచించారు. ప్లేగ్రౌండ్ విస్తరణకు విద్యార్థులు చేసిన విజ్ఞప్తికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.

విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్న కలెక్టర్ వారితో కలిసి భోజనం చేశారు. భోజన నాణ్యత సంతృప్తికరంగా ఉందని పేర్కొన్నారు. మెస్ కమిటీలు రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని, ప్రతిరోజు స్టాక్ వివరాలు నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వం డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో నిర్దేశిత మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు.

గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన వాతావరణం కల్పించాలని, క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ కోరారు. టాయిలెట్లు, ఫ్యాన్లు, లైట్లు, డోర్లకు ఏవైనా చిన్న మరమ్మతులు ఉంటే 15 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సీహెచ్ పద్మ, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలు భవాని తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story