Suryapet: రెవెన్యూ సేవలను వేగవంతం చేయాలి – కలెక్టర్ తేజస్ పవార్
Suryapet: సూర్యాపేటలో రెవెన్యూ సేవలు, భూభారతి, ప్రజావాణి దరఖాస్తులపై కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సమీక్ష. సాంకేతికత వినియోగించి సేవలు అందించాలని ఆదేశం.
Suryapet: రెవెన్యూ సేవలను వేగవంతం చేయాలి – కలెక్టర్ తేజస్ పవార్
సూర్యాపేట: జిల్లాలో రెవెన్యూ సేవలను మరింత వేగవంతం చేసి ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో వెబెక్స్ ద్వారా భూ భారతి, ప్రజావాణి దరఖాస్తులపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ రెవెన్యూ సర్వేల నుంచి ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం వరకు ప్రతి అంశంలో పారదర్శకత పాటించాలని, ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు. రెవెన్యూ, సర్వే శాఖలు సంయుక్తంగా చేపడుతున్న గ్రామ సర్వే ప్రక్రియ మరింత సమర్థవంతంగా సాగాలన్నారు. తహసీల్దార్లు, సర్వేయర్లు సమన్వయంతో పనిచేస్తూ ప్రతివారం పురోగతి నివేదికలు అందించాలని ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నివారించేందుకు అధునాతన ఏఐ, డిజిటల్ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. గతంలో గంటల సమయం పట్టే నివేదికలు, డ్రాఫ్టింగ్ పనులను సాంకేతికత ద్వారా నిమిషాల్లోనే నాణ్యతతో పూర్తి చేయవచ్చని, దీనివల్ల అధికారుల పనిభారం తగ్గడమే కాకుండా పౌరులకు వేగవంతంగా సేవలు అందుతాయని తెలిపారు.
మండలాల వారీగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రధాన భూసమస్యలను గుర్తించి ప్రత్యేక జాబితా రూపొందించాలని, ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులతో పాటు 60 రోజులకు పైబడి పెండింగ్‌లో ఉన్న భూభారతి కేసులను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డీఆర్వో ప్రేమ్ రాజ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




