Suryapet: ఎల్‌నినో ప్రభావంతో సాగునీటి కొరత ముప్పు.. రైతులు అప్రమత్తం కావాలి: కలెక్టర్!

Suryapet: ఎల్‌నినో ప్రభావంతో సాగునీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నందున యాసంగిలో వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలు సాగు చేయాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 24 Nov 2026 8:33 AM IST
Suryapet
X

Suryapet: ఎల్‌నినో ప్రభావంతో సాగునీటి కొరత ముప్పు.. రైతులు అప్రమత్తం కావాలి: కలెక్టర్!

సూర్యాపేట: ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో సాగునీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. రానున్న యాసంగి సీజన్‌లో వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.

పంటల వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన కల్పించేందుకు సూర్యాపేట జిల్లాలో చేపట్టిన 10 రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పంటల వైవిధ్యీకరణకు సంబంధించిన అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో పది రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు.

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో సాగునీటి లభ్యత తగ్గే అవకాశాలను ముందుగానే గుర్తించి రైతులు పంటల ఎంపికలో మార్పులు చేసుకోవాలన్నారు. యాసంగిలో వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి పెసర, మినుము, శనగ, బొబ్బర, జొన్న, మొక్కజొన్న, వేరుశెనగ, కూరగాయలు, పశుగ్రాస పంటలు సాగు చేయాలని సూచించారు. తక్కువ నీటి వినియోగంతో సాగు చేసే పంటలను ఎంచుకోవడం ద్వారా నీటి వనరులను పొదుపు చేసుకోవడంతో పాటు వ్యవసాయాన్ని స్థిరంగా కొనసాగించవచ్చన్నారు.

ప్రత్యేక ప్రచారంలో భాగంగా మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఉద్యానవన అధికారులు, ఉద్యానవన విస్తరణ అధికారులు, ఇతర అనుబంధ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి ప్రత్యామ్నాయ పంటల సాగు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు. నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, జిల్లా ఉద్యానవన అధికారి నాగయ్య, డీఎస్ఓ మోహన్ బాబు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ విశాల్ తో పాటు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA