Suryapet: సూర్యాపేట మహిళా శక్తి ఉత్సవంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్
Suryapet: కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో సూర్యాపేట ముందంజలో ఉండాలని కలెక్టర్ పిలుపు. వి హబ్ బూట్ క్యాంప్ ప్రారంభం.
Suryapet: సూర్యాపేట మహిళా శక్తి ఉత్సవంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్
సూర్యాపేట: ప్రభుత్వం చేపట్టిన కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా మహిళలు ముందు వరుసలో ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు.
బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా మహిళా శక్తి ఉత్సవంలో భాగంగా WE HUB ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బూట్ క్యాంప్ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహిళలు తయారు చేసిన వివిధ రకాల వస్తువులు, పచ్చళ్లు, జ్యూట్ బ్యాగులను పరిశీలించిన కలెక్టర్ వాటిని అభినందించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి స్వయంగా వస్తువులు తయారు చేసుకుని వచ్చిన మహిళలకు అభినందనలు తెలిపారు.
సూర్యాపేట జిల్లాలో మహిళా సంఘాలకు ఇప్పటికే 700 కోట్ల రూపాయల రుణాలు అందించామని తెలిపారు. ఆ నిధులను ఇంటి ఖర్చులు, విద్య, వైద్యానికి కాకుండా ఏదైనా వ్యాపారం లేదా గ్రూపుగా ఏర్పడి యూనిట్ ఏర్పాటు చేసుకుని లాభాలు పొందాలని సూచించారు. ప్రతి మండలం, ప్రతి గ్రామం నుంచి ఒక యూనిట్ రావాలన్నారు.
ఆశ, స్ఫూర్తి, తపన ఉంటే దానికి తొలి అడుగు వేయడంలో WE HUB అండగా ఉంటుందని కలెక్టర్ చెప్పారు. ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌లో WE HUB సలహాలు, సూచనలు అందిస్తుందని తెలిపారు. సూర్యాపేటలో మహిళా శక్తి భవన నిర్మాణం చేపట్టినట్లు, త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు.
మహిళల సందేహాల నివృత్తికి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 9391609994 నంబర్లో సంప్రదించవచ్చని అన్నారు. ఉత్పత్తులు తయారు చేసే మహిళల కోసం వాట్సప్ గ్రూపు, వాట్సప్ ఛానల్ ఏర్పాటు చేయాలని డిఆర్డిఓ పిడికి ఆదేశించారు.
గ్రామీణ విద్యార్థులకు కొత్త ప్రోగ్రామ్స్
ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ పిడి సన్యాసయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న పనులు చేసుకునే వారందరినీ ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మహిళలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
WE HUB సీఈఓ సీతా పళ్లచుని మాట్లాడుతూ WE HUB ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటైందని, చిన్న మార్కెట్‌కే పరిమితం కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్పత్తులను ఎలా మార్కెట్ చేయాలో అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ బూట్ క్యాంప్‌లో డిడబ్ల్యుఓ నరసింహారావు, అడిషనల్ డిఆర్డిఓ పిడి సురేష్, డిపిఎం అరుణ్ కుమార్, ఏపిఎంలు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, స్వయం సహాయక మహిళలు, WE HUB అసోసియేట్ డైరెక్టర్ జహీర్ అక్తర్ షేక్, ఊహ సజ్జతో పాటు టీం సభ్యులు పాల్గొన్నారు.




