Suryapet: సూర్యాపేటలో ఫుడ్ సేఫ్టీ డ్రైవ్.. కల్తీ ఆహారంపై కలెక్టర్ సీరియస్
Suryapet: సూర్యాపేట జిల్లాలో కల్తీ ఆహారానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రతి 15 రోజులకోసారి తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ అధికారులను ఆదేశించారు.
Suryapet: సూర్యాపేటలో ఫుడ్ సేఫ్టీ డ్రైవ్.. కల్తీ ఆహారంపై కలెక్టర్ సీరియస్
సూర్యాపేట: జిల్లా వ్యాప్తంగా ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఆహార భద్రతా సలహా కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి 15 రోజులకు ఒకసారి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని సూచించారు.
పాలు, పాల ఉత్పత్తులు, నూనెలు, మాంసం, గుడ్లు, స్వీట్లు, సిద్ధం చేసిన ఆహార పదార్థాలపై ప్రత్యేక నిఘా ఉంచి నమూనాల సంఖ్య పెంచాలన్నారు. వినియోగదారులకు స్వచ్ఛమైన పాలు అందేలా పాల విక్రయదారులపై దృష్టి సారించాలని తెలిపారు.
జాతీయ రహదారిపై ఆకస్మిక దాడులు
65వ జాతీయ రహదారిపై ఉన్న హోటళ్లు, దాబాలపై ఆకస్మిక దాడులు నిర్వహించి ఆహార నాణ్యత పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో కేసులు నమోదైన వారికి వెంటనే నోటీసులు జారీ చేయాలన్నారు.
పాఠశాలలు, అంగన్వాడీల్లో శిక్షణ
మధ్యాహ్న భోజనం వండేవారికి, అంగన్వాడీ కార్యకర్తలకు దశలవారీగా శిక్షణ ఇవ్వాలని, విద్యార్థులకు ఆహార భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. పాఠశాలల్లో ఆహార నిల్వ, భద్రత సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తుల తయారీ, నిల్వ, అమ్మకాలపై ఆహార భద్రత, పోలీస్, ఆరోగ్య శాఖలు సంయుక్త డ్రైవ్‌లు చేపట్టాలన్నారు. ఆహార భద్రత చట్టం 2006 ప్రకారం ప్రతి ఆహార వ్యాపారికి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తప్పనిసరి అని కలెక్టర్ పునరుద్ఘాటించారు.
ప్రజల్లో చైతన్యం కోసం ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ వాహనంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. కల్తీ ఆహారం గుర్తిస్తే ఫుడ్ సేఫ్టీ కనెక్ట్ యాప్, జిల్లా ఆహార భద్రతా కార్యాలయం 9133291926, కలెక్టరేట్ 08684-222666, రాష్ట్ర హెల్ప్‌లైన్ 9100105795, 040-21111111 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని కోరారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ తదితర అధికారులు పాల్గొన్నారు.




