Suryapet: దేశ సమైక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
Suryapet: సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో జాతీయ ఐక్యతా దినోత్సవం. దేశ సమైక్యతను కాపాడాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పిలుపు.
Suryapet: దేశ సమైక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
సూర్యాపేట: దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పిలుపునిచ్చారు. భారత ఉక్కుమనిషి, భారత తొలి ఉప ప్రధానమంత్రి, తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన "జాతీయ ఐక్యతా దినోత్సవం" కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ యువకుడిగా ఉన్నప్పటి నుండే భారతదేశ స్వాతంత్రం కోసం కృషి చేశారని, మహాత్మా గాంధీ పిలుపుమేరకు స్వాతంత్ర ఉద్యమంలో, సహాయ నిరాకరణ ఉద్యమంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారని అన్నారు. నెహ్రూ, సుభాష్ చంద్రబోస్‌లతో కలిసి భారతదేశ స్వాతంత్రం కోసం పని చేశారని, దేశ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు.
భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత సంస్థానాల విలీనం సందర్భంగా హైదరాబాద్ నిజాం సంస్థానాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ 1948 సెప్టెంబర్ 17న విలీనం చేసిన తీరును అందరూ స్మరణకు తెచ్చుకోవాలన్నారు. దేశ సమైక్యతను ప్రతి ఒక్కరూ కాపాడేందుకు కృషి చేయాలని పునరుద్ఘాటించారు.
"రాష్ట్రీయ ఏక్తా దివస్" సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారందరి చేత కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ప్రేమ్ రాజ్, జడ్పీ సీఈవో శిరీష, డీఎస్ఓ మోహన్ బాబు, ఆర్డీవోలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




