Suryapet: ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలి.. సూర్యాపేట కలెక్టర్ పిలుపు!
Suryapet: సూర్యాపేట కలెక్టరేట్‌లో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు జరిగాయి. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు.
Suryapet: ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలి.. సూర్యాపేట కలెక్టర్ పిలుపు!
సూర్యాపేట: వీరనారి చాకలి ఐలమ్మ పోరాటంలో చూపిన ధైర్యం, పోరాట పటిమ తరతరాలకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో అప్పటి అణచివేత, భూస్వామ్య వ్యవస్థకు ఎదురొడ్డి నిలిచిన ఐలమ్మ చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఆ స్ఫూర్తితో సమాజ పురోగతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా ప్రజలు ఎల్లప్పుడూ చైతన్యవంతంగా ఉంటారని, జిల్లాలోని ప్రతి ఒక్కరి సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం, అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
కేవలం ఒకే రంగానికి పరిమితం కాకుండా సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో జిల్లా ప్రజలు ఉన్నత స్థాయికి ఎదగాలని, చాకలి ఐలమ్మ వంటి మహానాయకుల చరిత్రను నేటి తరానికి అందిస్తూ, యువత చదువుతో పాటు అన్ని రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధనకు అందరూ కలసికట్టుగా ముందుకు సాగాలన్నారు.
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శం : ఎస్పీ నరసింహ
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరవనిత చాకలి ఐలమ్మ చూపిన తెగువ, పోరాట స్ఫూర్తి నేటి సమాజానికి ఎంతో ఆదర్శనీయమని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు.
1895లో జన్మించిన ఐలమ్మ, ఎలాంటి చదువు లేకపోయినా తన గుండె ధైర్యంతో నాటి అణచివేతను ఎదుర్కొన్నారని, విస్నూరు దేశ్‌ముఖ్ దౌర్జన్యాలకు, దొరల గడీల అన్యాయాలకు ఎదురొడ్డి 40 ఎకరాల కౌలు భూమి కోసం పోరాటం సాగించారని గుర్తుచేశారు.
ప్రస్తుత ప్రజాస్వామ్య పాలనలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, అన్యాయాలను శాంతియుతంగా ప్రశ్నించాలని, ప్రతి పాఠశాల, కళాశాలలో మహిళా భద్రత, చైతన్యంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, విఆర్ఓ ప్రేమ్ రాజ్, బీసీ వెల్ఫేర్ అధికారి విశాల్, నాయకులు డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్, భోమ్మగాని శ్రీనివాస్, బంటు కృష్ణ, చింతలపాటి చిన్న శ్రీరాములు, మట్టిపల్లి సైదులు, పోతుగంటి వీరాచారి, చల్లమల నరసింహ, తల్లమల్ల హషెన్, ధున్నా శ్యామ్, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




