Suryapet: ప్రజల అత్యాశే సైబర్ నేరగాళ్ల ఆయుధం: ఎస్పీ నరసింహ!

Suryapet: ప్రజల అత్యాశే సైబర్ మోసగాళ్లకు పెట్టుబడి అని సూర్యాపేట ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ అన్నారు. ఎస్వీ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 27 Oct 2026 6:58 PM IST
Suryapet
X

Suryapet: ప్రజల అత్యాశే సైబర్ నేరగాళ్ల ఆయుధం: ఎస్పీ నరసింహ!

సూర్యాపేట: ప్రజల అత్యాశను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, ఉచితాలు, అధిక లాభాల ఆశ చూపే మాయమాటలకు మోసపోవద్దని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ హెచ్చరించారు.

సైబర్ మోసాల నివారణపై మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ హాజరై విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆన్‌లైన్ ఆర్థిక లావాదేవీల సమయంలో పాటించాల్సిన భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని ఎవరైనా ఆశ చూపితే నమ్మవద్దని సూచించారు. ఉచితంగా డబ్బులు వస్తాయని, సులభంగా సంపాదించవచ్చని చెప్పే ఆకర్షణీయమైన ఆఫర్ల వెనుక మోసాలు దాగి ఉంటాయని, కష్టపడి సంపాదించిన డబ్బుకే విలువ ఉంటుందని అన్నారు. పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత సంస్థల విశ్వసనీయతను పరిశీలించాలని సూచించారు.

సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త: సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే వ్యక్తులు మొదట స్నేహంగా మాట్లాడుతూ నమ్మకం కలిగించి, ఆ తర్వాత తమ అసలు స్వరూపాన్ని బయటపెడతారని, ఆన్‌లైన్‌లో పరిచయమైన ప్రతి వ్యక్తిని గుడ్డిగా నమ్మకూడదని, వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, కుటుంబ సమాచారం, ఆర్థిక వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి: విద్యార్థులు, యువత తాత్కాలిక ఆకర్షణలకు లోనుకాకుండా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని నిరంతరం కృషి చేయాలని, మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా, ఇంటర్నెట్‌ను విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగించుకోవాలని, విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు.

గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, వ్యసనాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, అలాంటి సమాచారం ఏదైనా ఉంటే పోలీసులకు లేదా ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు తెలియజేయాలని అన్నారు. ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, వాహనాలపై వేగంగా వెళ్లవద్దని, స్టంట్‌లు, బెట్టింగ్‌లు నిర్వహించవద్దని తెలిపారు. తోటి విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగాలని, ర్యాగింగ్ చేస్తే కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేయాలని లేదా అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ సెల్ ఇన్‌స్పెక్టర్లు వెంకటయ్య, శివకుమార్, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సందీప్, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA