Suryapet: యాసంగిలో వరి వేయవద్దు.. జిల్లా వ్యవసాయ అధికారి హెచ్చరిక!
Suryapet: సూర్యాపేట జిల్లాలో లోటు వర్షపాతం, పడిపోయిన భూగర్భ జలాల దృష్ట్యా రాబోయే యాసంగిలో వరి సాగు వద్దని, ఆరుతడి పంటలు వేయాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి సూచించారు.
Suryapet: యాసంగిలో వరి వేయవద్దు.. జిల్లా వ్యవసాయ అధికారి హెచ్చరిక!
Suryapet: జిల్లాలో భూగర్భ జలాలు పడిపోవడం, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రాబోయే యాసంగి సీజన్లో రైతులు వరి సాగు చేయవద్దని జిల్లా వ్యవసాయ అధికారి (DAO) శ్రీధర్ రెడ్డి సూచించారు. జిల్లాలో 23 మండలాలకు గాను 19 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని, కరువు మండలాల నివేదికను ప్రభుత్వానికి పంపించామని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఎల్-నినో ప్రభావం వల్ల వర్షాలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయని, 19 మండలాల్లో లోటు వర్షపాతం ఏర్పడి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. దీంతో భూగర్భ జలాలు జూన్ నెలతో పోలిస్తే సగానికి పైగా పడిపోయాయని, ఫలితంగా బోర్ల కింద సాగు చేసిన వరి పంటలు కొన్ని ప్రాంతాల్లో ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
పంటలు ఎండిపోయాయని రైతులు అధైర్యపడి పొలాలకు నిప్పు పెట్టవద్దని కోరారు. జిల్లాలోని కరువు పరిస్థితులు, పంట నష్ట వివరాలను ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించామని, ప్రభుత్వ మార్గదర్శకాలు రాగానే రైతులకు తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
రాబోయే యాసంగి సీజన్లో రైతులెవరూ వరి సాగుకు వెళ్లవద్దని స్పష్టం చేశారు. ఇప్పటికే భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయని, వచ్చే రెండు మూడు నెలల్లో పంట పొట్టదశకు వచ్చేసరికి బోర్లు పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వరి సాగు కోసం ఎకరానికి దాదాపు రూ.30 నుంచి రూ.40 వేల పెట్టుబడి పెట్టి చివరకు నీరు లేక పంట ఎండిపోతే భారీ నష్టం వాటిల్లుతుందని, భూమిని ఖాళీగా ఉంచినా నష్టం ఉండదు కానీ, వరి వేసి నష్టపోవద్దని స్పష్టం చేశారు.
వరికి బదులుగా పెసర, మినుము వంటి పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు మరియు పశుగ్రాసం వంటి స్వల్పకాలిక ఆరుతడి పంటలను సాగు చేసి ఆర్థికంగా లాభపడాలని రైతులకు పిలుపునిచ్చారు.




