Suryapet: మిడ్తనపల్లిలో ఉపాధి పనులు, నీటి సంరక్షణపై కలెక్టర్ సమీక్ష!

Suryapet: సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం మిడ్తనపల్లిలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సమీక్ష నిర్వహించి, తాగునీరు, భూగర్భ జలాల పెంపుపై కీలక ఆదేశాలు జారీ చేశారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 24 Oct 2026 6:07 PM IST
Suryapet
X

Suryapet: మిడ్తనపల్లిలో ఉపాధి పనులు, నీటి సంరక్షణపై కలెక్టర్ సమీక్ష!

సూర్యాపేట: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులకు సూచించారు. మిషన్‌ భగీరథ నీటి సరఫరాతో పాటు స్థానిక నీటి వనరులను గుర్తించి, వార్డు వారీగా తాగునీటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. వారం రోజుల్లో ప్రణాళిక సిద్ధం చేసి, గ్రామసభలో ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. ఆత్మకూరు(ఎస్) మండలంలోని మిడ్తనపలీ గ్రామంలో నిర్వహించిన సమీక్షలో వివిధ శాఖల అధికారులు, గ్రామస్థులతో తాగునీరు, ఉపాధి హామీ పనులు, భూగర్భ జలాల పెంపు తదితర అంశాలపై చర్చించారు.

వారంలో తాగునీటి ప్రణాళిక..

గ్రామంలో ప్రస్తుతం మూడు బోర్లు అందుబాటులో ఉన్నాయని, వాటి ద్వారా నీటి సరఫరా జరుగుతోందని అధికారులు వివరించారు. అయితే భూగర్భ జలాలు మరింత తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. బోర్ల నుంచి నేరుగా పైపులైన్లకు నీటిని సరఫరా చేస్తున్న నేపథ్యంలో అవసరమైన శుద్ధి చర్యలు చేపట్టాలని సూచించారు. మిషన్‌ భగీరథ సరఫరా పరిస్థితిని పరిశీలించి, నీటి వనరుల లభ్యతను అంచనా వేయాలన్నారు.ప్రతి వార్డు, కాలనీ, గేరీ వారీగా ఎక్కడ నీరు అందుతోంది? ఎక్కడ సమస్య ఉంది? అనే వివరాలను సేకరించాలని ఆదేశించారు. ప్రధాన నీటి వనరు పనిచేయకపోతే ప్రత్యామ్నాయంగా ఎక్కడి నుంచి నీటిని సరఫరా చేయవచ్చో ముందుగానే గుర్తించాలని తెలిపారు. స్థానికంగా అందుబాటులో ఉన్న నీటి వనరులతో పాటు ఫ్లషింగ్‌ బోర్లను కూడా ప్రత్యామ్నాయంగా పరిశీలించాలని సూచించారు.

గ్రామంలోని ఓవర్‌హెడ్‌ సర్వీస్‌ రిజర్వాయర్‌ (ఓహెచ్‌ఎస్‌ఆర్‌) ట్యాంకుల వద్దకు వెళ్లేందుకు మెట్లు లేవని అధికారులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. అవసరమైన పనులను ఉపాధి పథకం లేదా ఇతర నిధుల ద్వారా చేపట్టే అవకాశాలను పరిశీలించాలని తెలిపారు. తాగునీటి అవసరాలకు సంబంధించిన సమస్యలను ప్రాధాన్య క్రమంలో పరిష్కరించాలని పేర్కొన్నారు.

ప్రతి నీటి చుక్కను భూమిలోకి ఇంకించాలి..

వర్షాలు తక్కువగా కురుస్తున్న నేపథ్యంలో భూగర్భ జలాల పెంపునకు ప్రాధాన్యం ఇవ్వాలని సమావేశంలో సూచించారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించడం ద్వారా వర్షపు నీటితో పాటు గృహ అవసరాలకు వినియోగించిన నీటిని కూడా భూమిలోకి ఇంకించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. మురుగు కాల్వల వద్ద డ్రైనేజీ సోక్‌పిట్లు, రోడ్లకు ఇరువైపులా సోకేజ్‌ ఛానళ్లు నిర్మించాలని పేర్కొన్నారు. రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాల్లో కమ్యూనిటీ సోక్‌పిట్లు ఏర్పాటు చేయడం ద్వారా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని వివరించారు. తాగునీటి బోర్ల వద్ద భూగర్భ జలాల పునరుద్ధరణకు రీచార్జ్‌ నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.

రైతులకు ప్రయోజనం చేకూరేలా పనులు..

వ్యవసాయ బోర్ల వద్ద కూడా నీటి పునరుద్ధరణ నిర్మాణాలు చేపట్టేందుకు ఉపాధి పథకంలో అవకాశాలున్నాయని అధికారులు వివరించారు. బోర్లలో నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో రీచార్జ్‌ పనులతో రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఉద్యాన పంటలు, పండ్ల తోటల పెంపకానికి ఆసక్తి ఉన్న రైతులకు ప్రభుత్వ పథకాల ద్వారా అందే సహాయాన్ని వివరించి, అర్హులైన వారిని గుర్తించాలని సూచించారు.

125 రోజుల ఉపాధి కల్పనకు ప్రణాళిక..

వర్షాభావంతో వ్యవసాయ పనులు తగ్గే అవకాశం ఉన్నందున గ్రామంలోనే కూలీలకు ఉపాధి కల్పించాలని సమావేశంలో పేర్కొన్నారు. గతంలో ఉపాధి హామీ పథకంగా అమలైన కార్యక్రమాన్ని ప్రస్తుతం వీబీ-జీ రామ్‌ జీగా పేర్కొంటూ, ప్రతి కుటుంబానికి 125 రోజుల ఉపాధి కల్పించే లక్ష్యంతో పనులను గుర్తించాలని వివరించారు. నీటి సంరక్షణ, ఇంకుడు గుంతలు, సోక్‌పిట్లు, బోర్ల రీచార్జ్‌ నిర్మాణాలు వంటి పనులను చేపట్టడం ద్వారా కూలీలకు ఆదాయం కల్పించడంతో పాటు గ్రామానికి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రైతులకు ఉపయోగపడే పనులను గుర్తించి, వివిధ శాఖల సమన్వయంతో కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గ్రామంలోనే ఉపాధి లభించేలా చర్యలు తీసుకోవడం ద్వారా వలసలను తగ్గించి, ప్రజలు గౌరవంగా జీవించే పరిస్థితులు కల్పించాలన్నారు.

పనుల అమలుపై గ్రామస్థుల పర్యవేక్షణ..

ఉపాధి పథకం కింద చేపట్టాల్సిన పనుల్లో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, అవసరమైన చోట సోకేజ్‌ ఛానల్‌, డ్రైనేజీ సోక్‌పిట్‌, తాగునీటి వనరుల పునరుద్ధరణ పనులు ఉన్నాయా లేదా అన్నది పరిశీలించాలని సూచించారు. గ్రామపంచాయతీ అధికారులు, ప్రజలు కలిసి పనుల అమలును పర్యవేక్షించాలని తెలిపారు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరేలా పనులను గుర్తించి, వాటి పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని పేర్కొన్నారు.

తాగునీటి సమస్యల పరిష్కారం, భూగర్భ జలాల పెంపు, గ్రామీణ ఉపాధి కల్పన, పారిశుద్ధ్య మెరుగుదలకు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి, జిల్లా పరిషత్‌ సీఈవో శిరీష, డీఆర్‌డీవో సన్యాసయ, డిఏఓ శ్రీధర్ రెడ్డి తహశీల్దార్‌ అనిల్ సింగ్, ఎంపీడీవో సత్యనారాయణ రెడ్డి, వైద్యాధికారి రమ్య, వ్యవసాయ శాఖ అధికారులు, విద్యుత్తు శాఖ ప్రతినిధులు, ఏపీవో, ఏపీఎం తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET