Suryapet: మార్కెట్‌లో రైతుల ఆందోళన.. మద్దతు ధర ఇవ్వాలని రోడ్డెక్కిన కర్షకులు
Suryapet: సూర్యాపేట మార్కెట్‌లో వ్యాపారులు సిండికేట్‌గా మారి ధాన్యం ధర తగ్గించడంతో రైతులు ఆందోళన చేపట్టారు. రూ.3 వేల ఆశ చూపి రూ.2 వేలకే కొంటున్నారని నిరసన.
Suryapet: మార్కెట్‌లో రైతుల ఆందోళన.. మద్దతు ధర ఇవ్వాలని రోడ్డెక్కిన కర్షకులు
సూర్యాపేట: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ మార్కెట్ ముందు నిరసన చేపట్టారు.
రైతులు తెలిపిన వివరాల ప్రకారం, ధాన్యానికి రూ.3 వేలకు పైగా ధర ఇస్తామని చెప్పి మార్కెట్‌కు రప్పించిన కమిషన్‌దారులు, భారీగా ధాన్యం రావడంతో సిండికేట్‌గా మారి ధర తగ్గించారని ఆరోపిస్తున్నారు. రూ.1,700 వరకు ధర తగ్గించి ప్రస్తుతం రూ.2,000 నుంచి రూ.2,300 మాత్రమే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంచి ధర వస్తుందన్న ఆశతో రైతులు పెద్ద మొత్తంలో ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకొచ్చారు. అయితే మొదట చెప్పిన ధరకు, ప్రస్తుతం ఇస్తున్న ధరకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో క్వింటాల్‌కు సుమారు రూ.1,400 వరకు నష్టపోతున్నామని వాపోతున్నారు. మార్కెట్‌లో పోటీ లేకుండా ధరను నిర్ణయిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.
మరోవైపు వర్షం కారణంగా మూడు రోజులుగా కాంటాలు నిలిచిపోవడంతో ధాన్యం అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు. వర్షానికి ధాన్యం తడవడంతో మరింత నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇచ్చిన మాట ప్రకారం ధర చెల్లించాలని, సిండికేట్‌గా నిర్ణయించిన ధరను రద్దు చేసి కొనుగోళ్లు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో మార్కెట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.




