Suryapet: అప్రకటిత కరెంట్ కోతలు. యర్కారం సబ్‌స్టేషన్ ముట్టడి, రాస్తారోకో!

Suryapet: సూర్యాపేట మండలంలో అప్రకటిత కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని యర్కారం సబ్‌స్టేషన్ ముట్టడించి రాస్తారోకో చేసిన రైతులు. 5 కి.మీ మేర స్తంభించిన ట్రాఫిక్.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 12 Sept 2026 12:22 PM IST
Suryapet
X

Suryapet: అప్రకటిత కరెంట్ కోతలు. యర్కారం సబ్‌స్టేషన్ ముట్టడి, రాస్తారోకో!

Suryapet: సూర్యాపేట మండల పరిధిలో అప్రకటిత కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహించిన రైతులు యర్కారం సబ్ స్టేషన్ ను ముట్టడించి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

కరెంట్ లేక బోరుబావుల కింద పంటలు ఎండిపోతున్నా అధికారులకు విన్నవించినా ఫలితం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పెద్ద ఎత్తున సబ్ స్టేషన్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఈ రాస్తారోకోతో సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ అధికారులతో మాట్లాడి రైతులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.

ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపిన మాజీ జెడ్పీటీసీ జీడీ భిక్షం మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్ల పాటు రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అది ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నించారు. ధాన్యం కొనాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే కావాలని పంటలను ఎండబెడుతున్నారని ఆరోపించారు.

అప్రకటిత కోతల వల్ల మోటార్లు కాలిపోతున్నాయని, ట్రాన్స్‌ఫార్మర్లు చెడిపోతే నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని రైతులు వాపోయారు. వర్షాలు లేకపోవడంతో పది ఎకరాలు సాగు చేసే రైతు కూడా ఎకరం, అరెకరం మాత్రమే సాగు చేస్తున్నారని, ఉన్న పంటకు కూడా కరెంటు ఇవ్వకపోతే పెట్టుబడి కూడా రాదని ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిరసన చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు స్పందించి 24 గంటలు కాకపోయినా కనీసం 12 గంటల పాటు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ అందించాలని, లేకుంటే పంటలు ఎండితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రైతులు ఉప్పల సైదులు, కాటసాని వెంకట్ రెడ్డి, ఈదుల యాదగిరి, అశోక్, రాఘవ రెడ్డి, లచ్చిరాం, అవుదొడ్డి ప్రవీణ్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA