Suryapet: సెంచరీ దాటిన సన్నబియ్యం ధర.. సామాన్యులపై భారం!

Suryapet: సూర్యాపేట జిల్లాలో సన్నబియ్యం ధర కిలో వంద రూపాయలు దాటడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 1 Nov 2026 8:22 AM IST
Suryapet
X

Suryapet: సెంచరీ దాటిన సన్నబియ్యం ధర.. సామాన్యులపై భారం!

Suryapet: అన్నం మెతుకుపై అక్రమ వ్యాపారులు కన్నేశారు. పేదోడి బువ్వను తమ అధిక సంపాదనకు అడ్డాగా మార్చుకున్నారు. బహిరంగ మార్కెట్లో, గోదాముల్లో సరిపడా నిల్వలు ఉన్నప్పటికీ సన్నబియ్యం ధర సెంచరీ దాటి సామాన్యుడి కంచంలో చిచ్చు పెడుతోంది.

వెనుకటి రోజుల్లో రాజులు, దొరలు, భూస్వాములు అన్నం తింటే పేదలు జొన్న, రాగి, సద్దలతో సరిపెట్టుకునేవారు. కాలం మారి ఇప్పుడు పేదలు వరి అన్నం తింటుంటే, ధనికులు ఆరోగ్యం కోసం చిరుధాన్యాలు, సిరిధాన్యాలైన అరికెలు, సజ్జలు, కొర్రలు, ఊదలు, సామల వైపు మళ్లుతున్నారు. అయితే పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా తినే సన్నబియ్యం ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో వంద రూపాయలు దాటి కొనలేని పరిస్థితి నెలకొంది.

ఎల్నినో బూచి చూపి దోపిడీ:

వాతావరణంలో ఎల్నినో ప్రభావం, సన్నబియ్యం కొరత వస్తుందంటూ లేనిపోని భయాలను సృష్టించి మిల్లర్లు, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇప్పుడు అమ్ముతున్న బియ్యం గత వానాకాలం సీజన్‌ది. గత సీజన్‌లో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి జరిగింది. గోదాముల్లో, మిల్లుల్లో ధాన్యపు రాశులు గలగలలాడుతున్నా, వ్యాపారులు బియ్యాన్ని బ్లాక్ చేసి రేట్లు ఇష్టారాజ్యంగా పెంచుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

సిండికేట్‌గా ఏర్పడి బియ్యం బస్తాలను గోదాముల్లో దాచిపెట్టి, మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి సామాన్యులను దోచుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.

నారు పోసినోడు కాదు, దోచుకునేది వ్యాపారే:

నారు పోసినోడు కాదు, నీరు పెట్టినోడు కాదు, కలుపు తీసినోడు కాదు, ఎరువేసినోడు కాదు, పంటను కన్నబిడ్డలా సాకినోడు కాదు.. ధర నిర్ణయించేది మాత్రం వ్యాపారులేనన్న ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది.

రైతు అమ్మితే వడ్లకు రేటు ఉండదు, పత్తికి రేటు ఉండదు. కానీ అదే బియ్యంగా మారితే, బట్టలుగా, పరుపులుగా మారితే రేటును వ్యాపారులే నిర్ణయించి అమ్ముతున్నారు. తయారీదారు తన ఉత్పత్తికి తానే ధర నిర్ణయించే రోజుల్లో, దేశానికి అన్నం పెట్టే రైతు మాత్రం కొనుగోలుదారు చెప్పిన రేటుకే అమ్ముకోవాల్సిన దుస్థితి 80 ఏళ్ల స్వతంత్ర భారతంలోనూ కొనసాగుతుందని రైతు సంఘాలు వాపోతున్నాయి.

అధికారులూ జర దేఖో సార్లూ..!

బియ్యం బస్తాల్లోకి చేరిన బ్లాక్ దందాను అరికట్టాలని, గోదాముల్లో నిల్వలున్నా రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో విచారించాలని ప్రజలు కోరుతున్నారు. వ్యాపారుల అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట వేసి, అక్రమ నిల్వలపై దాడులు చేసి, బియ్యం ధరలను నియంత్రించి సామాన్యుడికి అందుబాటులోకి తేవాలని ప్రజలు సంబంధిత అధికారులను వేడుకుంటున్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA