Suryapet: మేళ్లచెరువులో వైభవంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవం
Suryapet: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం పురస్కరించుకుని శివపార్వతుల కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Suryapet: మేళ్లచెరువులో వైభవంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవం
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సోమవారం సందర్భంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దేవస్థాన అర్చకులు వేదమంత్రోచ్చారణల నడుమ సంప్రదాయబద్ధంగా కల్యాణ వేడుకలను జరిపించారు.
ఈ సందర్భంగా తెల్లవారుజామున స్వామివారికి తొలి అభిషేక పూజలు నిర్వహించారు. వాయులింగ అభిషేకం, ఇష్టకామేశ్వరి అమ్మవారికి పంచామృత అభిషేకం, రాహు–కేతువులకు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి స్వామివారిని విశేషంగా అలంకరించారు.
అనంతరం గణపతి పూజ, కంకణధారణ, పాదపూజ, మాంగల్య పూజ తదితర క్రతువులతో శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. శుభముహూర్తంలో జీలకర్ర–బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల ఘట్టాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించడంతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది.
కల్యాణ మహోత్సవం అనంతరం స్వామివారికి మహానివేదన, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట డీసీఆర్‌బీ డీఎస్పీ రవి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ పూజా కార్యక్రమాల్లో దేవస్థాన అర్చకులు కొంకపాక విష్ణువర్ధన్ శర్మ, ధనుంజయ శర్మ, కార్యనిర్వహణాధికారి నాగేళ్ల శంబిరెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ పెండ్లి లచ్చయ్య, కమిటీ సభ్యులు వరగాని నాగరాజు, బా రెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణ, రామారావు, రవీందర్ రెడ్డి, లక్ష్మ, దేవమణి తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.




