Suryapet: మోతే దంపతుల హత్య కేసు: బాధిత కుటుంబానికి ప్రభుత్వ అండ!
Suryapet: సూర్యాపేట జిల్లా మోతేలో హత్యకు గురైన దంపతుల కుటుంబాన్ని కలెక్టర్ తేజస్, ఎస్పీ నరసింహ పరామర్శించారు. రూ. 4.20 లక్షల ఆర్థిక సాయం అందించారు.
Suryapet: మోతే దంపతుల హత్య కేసు: బాధిత కుటుంబానికి ప్రభుత్వ అండ!
సూర్యాపేట: మోతే మండలం బిక్యా తండాలో దారుణ హత్యకు గురైన దంపతులు నాగులు, బుబా కుటుంబానికి జిల్లా యంత్రాంగం పూర్తి అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ భరోసా కల్పించారు.
మంగళవారం వారు స్వయంగా బాధితుల నివాసానికి వెళ్లి వారి కుమార్తెలు జ్యోతి, సంధ్యలను పరామర్శించి ఓదార్చారు. అట్రాసిటీ కేసు కింద రావాల్సిన పరిహారంలో మొదటి విడతగా 50 శాతం రూ.4.20 లక్షలను బాధితుల ఖాతాలో జమ చేసి, ఆ ఉత్తర్వులను కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇలాంటి ఘోరం జరగడం బాధాకరమని, బాధిత కుటుంబానికి జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. పోలీసులు ప్రతి చిన్న ఆధారాన్ని నిశితంగా సేకరిస్తున్నారని, త్వరగా చార్జిషీట్ సిద్ధం చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని తెలిపారు.
ఎస్పీ నరసింహ మాట్లాడుతూ, హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితులను గుర్తించి రిమాండ్‌కు తరలించామని, శాంతిభద్రతల విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. కేసును లోతుగా, పారదర్శకంగా దర్యాప్తు చేసేందుకు డీఎస్పీని విచారణ అధికారిగా నియమించామని, నిపుణులైన స్పెషల్ అడ్వకేట్ సలహాలు తీసుకుంటున్నామని చెప్పారు. నిందితులను తిరిగి పోలీస్ కస్టడీకి తీసుకుని అన్ని కోణాల్లో విచారించి పక్కా ఆధారాలు నమోదు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ వేణు మాధవ్, తహసీల్దార్ వెంకన్న, సీఐ రామకృష్ణా రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, ఇతర అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.




