Suryapet: సూర్యాపేట మున్సిపాలిటీకి ‘ఉత్తమ పర్యావరణ పురస్కారం’!

Suryapet: వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో సూర్యాపేట మున్సిపాలిటీకి అరుదైన గౌరవం దక్కింది.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 5 Jun 2026 2:08 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేట మున్సిపాలిటీకి ‘ఉత్తమ పర్యావరణ పురస్కారం’!

సూర్యాపేట: వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో విశేష కృషి చేసిన సూర్యాపేట మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయి గుర్తింపు దక్కింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి టీజీపీసీబీ ప్రదానం చేసే ‘ఉత్తమ పర్యావరణ పనితీరు పురస్కారం’కు సూర్యాపేట మున్సిపాలిటీ ఎంపికైంది.

శుక్రవారం హైదరాబాద్‌లోని టీజీపీసీబీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి, మున్సిపల్ కమిషనర్ హన్మంత రెడ్డి అవార్డు అందుకున్నారు.

పట్టణంలో వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ వ్యర్థాల పునర్వినియోగం, పారిశుధ్య కార్యక్రమాల అమలు, పర్యావరణ పరిరక్షణ చర్యల్లో చూపిన ప్రతిభకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్, ప్రజల భాగస్వామ్యంతో పర్యావరణహిత కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం మున్సిపాలిటీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి మాట్లాడుతూ, ఈ పురస్కారం పట్టణ ప్రజలు, పారిశుధ్య కార్మికులు, అధికారులు, ప్రజాప్రతినిధుల సమిష్టి కృషికి నిదర్శనమని అన్నారు. భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేసి సూర్యాపేటను రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిద్దుతామని తెలిపారు.

కమిషనర్ హన్మంత రెడ్డి మాట్లాడుతూ వ్యర్థాల నిర్వహణలో అమలు చేస్తున్న వినూత్న విధానాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు చర్యలు కొనసాగిస్తామని చెప్పారు.

ఈ అవార్డుతో సూర్యాపేట మున్సిపాలిటీ రాష్ట్రంలో పర్యావరణహిత పట్టణాల జాబితాలో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story