Thungathurthy: మద్దిరాలలో ‘నివేశక్ దీదీ’ అవగాహన శిబిరం నిర్వహణ
Thungathurthy: మద్దిరాలలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఆధ్వర్యంలో నివేశక్ దీదీ అవగాహన శిబిరం నిర్వహించారు.
Thungathurthy: మద్దిరాలలో ‘నివేశక్ దీదీ’ అవగాహన శిబిరం నిర్వహణ
తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం గ్రామీణ ప్రజలకు పెట్టుబడులు, పొదుపు పథకాలు, బీమా సేవలపై అవగాహన కల్పించేందుకు మద్దిరాల గ్రామ పోస్టాఫీసు ఆధ్వర్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB), ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (IEPFA) సంయుక్త సహకారంతో ‘నివేశక్ దీదీ’ అవగాహన శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులకు వివిధ పొదుపు, పెట్టుబడి పథకాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా పాంజీ స్కీములు, నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లు, మోసపూరిత పెట్టుబడి పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధిక లాభాల ఆశ చూపే మోసపూరిత పథకాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు.
అలాగే తపాలా శాఖ అందిస్తున్న వివిధ పొదుపు, పెట్టుబడి పథకాలతో పాటు IPPB ద్వారా అందుతున్న సేవింగ్స్ ఖాతాలు, బీమా పథకాల వివరాలను వివరించారు. కేవలం రూ.750 వార్షిక ప్రీమియంతో రూ.15 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అందించే పథకం గురించి ప్రత్యేకంగా వివరించి, దాని ప్రయోజనాలను గ్రామస్తులకు తెలియజేశారు.
శిబిరానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై పెట్టుబడుల భద్రత, పొదుపు పథకాలు, బీమా సేవలకు సంబంధించిన తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, నమ్మకమైన సంస్థలు అందించే పథకాలనే ఎంచుకోవాలని నిర్వాహకులు సూచించారు.




