Suryapet: పదో తరగతి పరీక్ష ఫీజుల దోపిడీని అరికట్టాలి

Suryapet: సూర్యాపేటలో పదో తరగతి పరీక్ష ఫీజుల పేరుతో ప్రైవేట్ పాఠశాలల నిలువు దోపిడీని అరికట్టాలని, విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ డిమాండ్.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 12 Nov 2026 7:56 PM IST
Suryapet
X

Suryapet: పదో తరగతి పరీక్ష ఫీజుల దోపిడీని అరికట్టాలి

సూర్యాపేట: పదో తరగతి పరీక్ష ఫీజుల పేరుతో ప్రైవేట్ పాఠశాలలు నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయని, దానిని అరికట్టాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి డిమాండ్ చేశారు. పీడీఎస్‌యూ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సింహాద్రి మాట్లాడుతూ పదో తరగతి పబ్లిక్ పరీక్షలను సైతం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు వ్యాపారంగా మార్చుకొని విద్యార్థుల తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పెడుతున్నాయని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం పదో తరగతి వార్షిక పరీక్షల రుసుమును కేవలం రూ.125గా నిర్ణయిస్తే, కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మాత్రం పరీక్ష ఫీజు పేరుతో రూ.వెయ్యికి పైగా, మరికొన్ని పాఠశాలల్లో రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నాయని అన్నారు.

ఆన్‌లైన్ ఖర్చులు, ఇతర నిర్వహణ ఖర్చుల పేరుతో విద్యార్థుల నుంచి ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేయడం ఏ నిబంధనల ప్రకారం చేస్తున్నారో విద్యాశాఖ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా మార్చుకున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలకు విద్యార్థుల భవిష్యత్తు కంటే డబ్బు సంపాదనే ముఖ్యమైందని విమర్శించారు.

జిల్లాలో సుమారు 350 ప్రైవేట్ పాఠశాలల్లో దాదాపు 6 వేల మంది పదో తరగతి విద్యార్థులు చదువుతున్నారని, ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థుల నుంచి అదనపు వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నా విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ అధికారులు కొమ్ముకాస్తున్నారా? లేక చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా? అని అన్నారు.

పరీక్షల సమయంలో విద్యార్థులను, తల్లిదండ్రులను మానసిక ఒత్తిడికి గురిచేస్తూ ఫీజుల పేరుతో డబ్బులు గుంజడం దారుణమన్నారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం ఇప్పటికే ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి అక్రమ అదనపు వసూళ్లు వారి కుటుంబాలపై మరింత భారాన్ని మోపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో పదో తరగతి పరీక్ష ఫీజుల వసూళ్లపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. ప్రభుత్వం నిర్ణయించిన రుసుముకు మించి నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అదనంగా వసూలు చేసిన డబ్బులను విద్యార్థుల తల్లిదండ్రులకు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు.

అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న యాజమాన్యాలపై జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులు, తల్లిదండ్రులను సమీకరించి ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు లెనిన్, వంశీ, ప్రవీణ్, వినయ్, మహేష్, నవీన్, భార్గవ్, సాయి, రాజు, నాగరాజ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA