Suryapet: సూర్యాపేటలో విద్యా వ్యాపారం నిబంధనలు గాలికి.. దోపిడీయే ధ్యేయం!
Suryapet: ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ, గుర్తింపు లేని పాఠశాలలపై ప్రత్యేక వార్త. పుస్తకాల ఫీజుల మోత, ఫైర్ సేఫ్టీ లేని భవనాలపై కలెక్టర్ చర్యలకు డిమాండ్.
Suryapet: సూర్యాపేటలో విద్యా వ్యాపారం నిబంధనలు గాలికి.. దోపిడీయే ధ్యేయం!
Suryapet: జిల్లాలో పాఠశాల విద్య వ్యాపారమయమైంది. చదువుల పేరుతో ప్రైవేట్ యాజమాన్యాలు సాగిస్తున్న దోపిడీకి అడ్డే లేకుండా పోయింది. నిబంధనలను కాగితాలకే పరిమితం చేస్తూ, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నా విద్యాశాఖ అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అధిక ధరలకు పుస్తకాలు ఇదో బహిరంగ రహస్యం!
ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాలలో విద్యా సంస్థల పేరుతో వ్యాపార దుకాణాలు వెలిసాయి. నిబంధనల ప్రకారం బయట మార్కెట్‌లో దొరికే పుస్తకాలను మాత్రమే సిఫార్సు చేయాల్సి ఉండగా, ప్రైవేట్ స్కూళ్లు పాఠశాల ఆవరణలోనే అధిక ధరలకు పుస్తకాలు, యూనిఫామ్‌లు, టైలు విక్రయిస్తూ తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పొడుస్తున్నాయి. ఏటా ఫీజుల మోత, పుస్తకాల ధరల పేరుతో సామాన్యుల నడుము విరుస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు.
- గుర్తింపు లేని స్కూళ్లు.. ఫిట్‌నెస్ లేని బస్సులు!
జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అనుమతులు, గుర్తింపు (Recognition) లేని పాఠశాలలు పదుల సంఖ్యలో కొనసాగుతున్నాయన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
- రవాణా భద్రత గాల్లోనే:
విద్యార్థులను తీసుకెళ్లే కొన్ని ప్రైవేట్ స్కూల్ బస్సులకు కనీస ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేవు. కండీషన్‌లో లేని వాహనాల్లో చిన్నారుల ప్రాణాలను పణంగా పెట్టి రవాణా సాగిస్తున్నా రవాణా, విద్యాశాఖల సమన్వయ రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది.
- అనుమతులు లేవు.. నోటీసులకు లెక్కే లేదు!
కమర్షియల్ భవనాలు, సరైన వెంటిలేషన్ లేని గదులు, ఫైర్ సేఫ్టీ (అగ్నిమాపక భద్రత) సున్నా, కనీస ఆటస్థలం (Playground) కూడా లేని భవనాల్లో పాఠశాలలు నడుస్తున్నాయి.
- కంచె చేను మేసినట్లు.. విద్యాశాఖ ఉద్యోగులే యజమానులైతే?
జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పనిచేసే ఒక ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా ఏకంగా ప్రైవేట్ పాఠశాలనే ప్రారంభించడం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. విద్యా వ్యవస్థను పర్యవేక్షించాల్సిన ఉద్యోగులే స్వయంగా అక్రమ పాఠశాలలు నిర్వహిస్తుంటే ఇక చర్యలు ఎవరు తీసుకుంటారు?
- అధికారుల తీరుపై పెల్లుబుకుతున్న ఆగ్రహం
విద్యార్థి సంఘాలు ఎన్నో రకాలుగా ధర్నాలు, ఆందోళనలు చేసినా, విమర్శలు వెల్లువెత్తినా విద్యాశాఖ ఉన్నతాధికారి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కింది స్థాయి ఉద్యోగులపై మాత్రమే చర్యలు తీసుకుంటూ కాలయాపన చేస్తున్నారని, అసలు బాధ్యులైన ఉన్నతాధికారులపై చర్యలేవని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై, అక్రమ పాఠశాలలను నడుపుతున్న వారిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.




