Suryapet: రైలు సౌకర్యం వచ్చే వరకు పోరాటం ఆగదు సాధన సమితి!
Suryapet: సూర్యాపేట జిల్లా కేంద్రానికి రైల్వే సౌకర్యం సాధించే వరకు పోరాటం ఆగదని రైల్వే సాధన సమితి స్పష్టం చేసింది.
Suryapet: రైలు సౌకర్యం వచ్చే వరకు పోరాటం ఆగదు సాధన సమితి!
Suryapet: సూర్యాపేటకు రైల్వే సాధించడమే తమ ఏకైక లక్ష్యమని, అది సాధించే వరకు ఉద్యమం ఆగదని సూర్యాపేట రైల్వే సాధన సమితి ఉద్యమ నిర్వహణ కమిటీ సభ్యులు మంగళవారం ప్రతిజ్ఞ చేశారు.
సమితి కార్యాలయంలో జరిగిన సమావేశంలో 32 మంది సభ్యులతో ఏర్పాటైన ఉద్యమ నిర్వహణ కమిటీ త్రికరణశుద్ధితో, రాజకీయాలకు అతీతంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రమాణ స్వీకారం చేసింది.
సూర్యాపేట వంటి ప్రధాన జిల్లా కేంద్రానికి ఇప్పటికీ రైల్వే సౌకర్యం లేకపోవడం విచారకరమని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే లైన్ సాధనలో రాజకీయ భేదాలకు తావులేకుండా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, యువత, మేధావులు, వ్యాపార వర్గాలు, అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని నిర్ణయించారు.
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ అయినా, హైస్పీడ్ ట్రైన్ అయినా, సాధారణ రైల్వే లైన్ అయినా త్వరితగతిన మంజూరు అయ్యేలా ఉద్యమాన్ని దశలవారీగా ఉధృతం చేయాలని తీర్మానించారు. శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు మహాజర్లు, వినతిపత్రాలు, సంతకాల సేకరణ, ప్రజా చైతన్య కార్యక్రమాలు, సమావేశాలు, ర్యాలీలు నిరంతరం నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.
సమితి కన్వీనర్ డేగల జనార్ధన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ వి. రామమూర్తి, డాక్టర్ కే. రంగారెడ్డి, సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్ రెడ్డి, కార్యదర్శి తలమల్ల హసేన్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు చింతలపాటి చిన్న శ్రీరాములు, కో-కన్వీనర్లు రాచూరి ప్రతాప్, డాక్టర్ ఏ. రమేష్ చంద్ర, గౌరవ సలహాదారు లింగంపల్లి భద్రయ్య, తీకుల్లా సాయి రెడ్డి, బొమ్మిడి లక్ష్మీనారాయణ, అంతటి విజయ్ కుమార్, కోఆర్డినేటర్ బిక్కుమల్ల ఉపేందర్, కే. సిద్ధారెడ్డి, సముద్రాల రాంబాబు, నల్లపాటి అప్పారావు, మతకాల చలపతిరావు, పోతరాజు నరసయ్య, యామా ప్రభాకర్, యాతాకుల రాజన్న మాదిగ, మామిడి అంజయ్య, కే. మంజుల, ముస్లిం మత పెద్ద ఖలీల్ అహ్మద్, గంధమల్ల శ్రీను, మారోజు కృష్ణమూర్తి, ఆర్. నరేందర్, కార్యాలయ కార్యదర్శి అక్కినేపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో ఉద్యమాన్ని బాధ్యతాయుతంగా, దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లే అంశాలపై విస్తృతంగా చర్చించి పలు కార్యాచరణ నిర్ణయాలు తీసుకున్నారు.
ఉద్యమానికి రూ.30 వేల విరాళం
సూర్యాపేట రైల్వే సాధన ఉద్యమానికి ప్రముఖ జువెలరీ వ్యాపారి అంతటి విజయ్ కుమార్ రూ.30 వేల ఆర్థిక విరాళాన్ని ప్రకటించారు. రైల్వే సాధన కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమానికి ఆర్థికంగా అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఆయన సహకారం ఇతర దాతలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని సమితి నాయకులు అన్నారు. ఉద్యమ లక్ష్య సాధన వరకు ప్రజల సహకారంతో పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు.




