Suryapet: ఆర్డీవో క్రీడా ప్రతిభ.. జాతీయ ఫుట్‌బాల్ పోటీల్లో తెలంగాణ తరపున ఆట!
Suryapet: గోవాలో జరుగుతున్న అఖిల భారత సివిల్ సర్వీసెస్ జాతీయ ఫుట్‌బాల్ పోటీల్లో సూర్యాపేట ఆర్డీవో వేణుమాధవ రావు తెలంగాణ తరపున ఆడుతున్నారు.
Suryapet: ఆర్డీవో క్రీడా ప్రతిభ.. జాతీయ ఫుట్‌బాల్ పోటీల్లో తెలంగాణ తరపున ఆట!
Suryapet: ఒకవైపు పరిపాలనాపరమైన విధుల్లో నిత్యం బిజీగా ఉంటూనే, మరోవైపు క్రీడలపై ఉన్న మక్కువతో ఫుట్‌బాల్ ఆటలో రాణిస్తూ సూర్యాపేట ఆర్డీవో వేణుమాధవ రావు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. గోవా రాష్ట్రంలో జరుగుతున్న అఖిల భారత సివిల్ సర్వీసెస్ జాతీయ స్థాయి ఫుట్‌బాల్ (2026-27) పోటీల్లో ఆయన తెలంగాణ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు.
ఈ నెల 17 నుండి 25వ తేదీ వరకు గోవా వేదికగా ఈ జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. ఫుట్‌బాల్ క్రీడలో మంచి ప్రావీణ్యం ఉన్న వేణుమాధవ రావు, ఈ టోర్నమెంట్‌లో తెలంగాణ సివిల్ సర్వీసెస్ జట్టుకు స్ట్రైకర్ / మిడ్ ఫీల్డర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర జట్టులో డిప్యూటీ కలెక్టర్ స్థాయి హోదాలో ఎంపికై మైదానంలో ఆడుతున్న ఏకైక ఆటగాడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.
ఉద్యోగ బాధ్యతల ఒత్తిడిని అధిగమిస్తూ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై, తెలంగాణ తరపున ఆడుతుండటం పట్ల పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది, క్రీడాకారులు మరియు సూర్యాపేట పట్టణ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ వేదికపై ప్రతిభ చాటుతున్న ఆర్డీవో వేణుమాధవ రావుకు పలువురు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.




