Suryapet: ఆత్మకూరు (ఎస్) పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ కె. నరసింహ
Suryapet: ఆత్మకూరు (ఎస్) పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ కె. నరసింహ ఆకస్మిక తనిఖీ. రికార్డులు, కేసుల పురోగతి సమీక్షించి అసాంఘిక శక్తులపై కఠినంగా ఉండాలని ఆదేశాలు.
Suryapet: ఆత్మకూరు (ఎస్) పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ కె. నరసింహ
సూర్యాపేట: ఆత్మకూరు (ఎస్) పోలీస్ స్టేషన్‌ను సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో రికవరీలో ఉన్న వాహనాలు, కేసులకు సంబంధించిన సామగ్రిని పరిశీలించారు. స్టేషన్ పరిసరాలను తనిఖీ చేయడంతో పాటు, వివిధ రకాల రికార్డులు, కేసు దస్త్రాలు, కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. పోలీస్ సిబ్బంది పనితీరు, సామర్థ్యం, శిక్షణ తదితర అంశాలపై సిబ్బందితో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశించారు. ప్రతి పౌరుడికి రక్షణ కల్పించడం పోలీసుల ప్రాథమిక విధి అని పేర్కొన్నారు. కేసుల నమోదు, దర్యాప్తు ప్రక్రియలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ, నేరస్థులకు న్యాయస్థానాల్లో శిక్షలు పడేలా నాణ్యమైన ఆధారాలను సేకరించి దర్యాప్తు చేయాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలను సమర్థవంతంగా అరికట్టాలని, నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ గస్తీని ముమ్మరం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ స్థానిక పరిస్థితులు, సమస్యలు, నేరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో యువత చెడు వ్యసనాలకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల నివారణతో పాటు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీసులు సమర్థవంతంగా పనిచేసినప్పుడే ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం, విశ్వాసం పెరుగుతాయని ఎస్పీ పేర్కొన్నారు.
ఈ తనిఖీలో సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్, ఆత్మకూరు ఎస్ఐ ఐలయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




