Suryapet: పోలీసులకు ఆర్థిక క్రమశిక్షణ, ఆరోగ్యంపై ఎస్పీ నరసింహ అవగాహన
Suryapet: సూర్యాపేట పోలీసు సిబ్బందికి స్వీయ నియంత్రణ, ఆర్థిక క్రమశిక్షణపై అవగాహన సదస్సు. అనధికారిక సంస్థలలో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని ఎస్పీ నరసింహ హెచ్చరిక.
Suryapet: పోలీసులకు ఆర్థిక క్రమశిక్షణ, ఆరోగ్యంపై ఎస్పీ నరసింహ అవగాహన
సూర్యాపేట: సమాజ భద్రతలో కీలక పాత్ర పోషించే పోలీసు సిబ్బంది స్వీయ నియంత్రణ, ఆరోగ్యకరమైన జీవనం మరియు ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ పిలుపునిచ్చారు.
ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులు, సిబ్బందితో ఆయన ప్రత్యేక సంక్షేమ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు హాజరై సిబ్బందికి ఆర్థిక నిర్వహణ, పొదుపు, పెట్టుబడులపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ.. క్రమశిక్షణతో కూడిన శిక్షణ పొందిన పోలీసులు సమాజంలో సాధారణ పౌరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. అధిక లాభాల ఆశతో ఎలాంటి భద్రత లేని పథకాలు, అనధికారిక సంస్థల్లో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని సూచించారు. బెట్టింగ్ సంస్కృతికి, సోషల్ మీడియా వ్యసనాలకు, చెడు అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలన్నారు.
అనవసర విలాసాల కోసం అప్పులు చేసి కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకోవద్దని, ఎల్లప్పుడూ దీర్ఘకాలిక ప్రయోజనాలు, కుటుంబ ఆర్థిక భద్రత వైపు ఆలోచన చేయాలని, పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని ఆకాంక్షించారు. ఒత్తిడితో కూడిన విధులు నిర్వహించే పోలీసులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు.
చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులు ఎలాంటి తప్పులు, నేరాలకు పాల్పడకూడదని, వ్యక్తిగత లేదా వృత్తిపరమైన సమస్యలు ఉంటే నిర్భయంగా ఉన్నతాధికారులకు చెప్పుకుని పరిష్కరించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, అడ్మిన్ అధికారి మంజు భార్గవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నారాయణరాజు, ప్రవీణ్ కుమార్, ఎస్బీఐ సూర్యాపేట రీజినల్ చీఫ్ మేనేజర్ అరుంధతి, ఫైనాన్షియల్ అసిస్టెంట్ మేనేజర్ రామిరెడ్డి, జిల్లాలోని పలువురు ఎస్సైలు, ఆర్ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




