Suryapet: జాతీయ స్థాయి క్రికెట్‌కు కుడకుడ విద్యార్థిని ఎంపిక!
Suryapet: జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన కుడకుడ విద్యార్థిని పల్లవికి సూర్యాపేట ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ ఆర్థిక సాయం అందించి ప్రత్యేకంగా అభినందించారు.
Suryapet: జాతీయ స్థాయి క్రికెట్‌కు కుడకుడ విద్యార్థిని ఎంపిక!
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రం తరఫున జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన పల్లవిని ప్రోత్సహిస్తూ జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ ఆర్థిక సహాయం అందించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పల్లవికి నగదు సహాయం అందించి ఎస్పీ అభినందించారు.
కుడకుడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న పల్లవి 17 సంవత్సరాల బాలికల క్రికెట్ జట్టుకు తెలంగాణ రాష్ట్రం తరఫున జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనేందుకు ఎంపికైంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న పల్లవి ఇటీవల నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల ఎస్పీ హర్షం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా జిల్లా పోలీసు శాఖ తరఫున ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ.. పల్లవి జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి మరిన్ని విజయాలు సాధించాలని, సూర్యాపేట జిల్లాకు, శిక్షణనిచ్చిన కోచ్‌లకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
క్రీడల్లో ప్రతిభ చూపే యువతను ప్రోత్సహించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. జాతీయ స్థాయి క్రీడలకు ఎంపిక కావడం పల్లవి కృషి, పట్టుదలకు నిదర్శనమని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, వెల్ఫేర్ ఆర్ఎస్ఐ సాయిరాం, కోచ్‌లు పాల్గొన్నారు.




