Suryapet: సూర్యాపేటలో 'సైబర్ వారియర్స్' కు ప్రత్యేక శిక్షణ & సమీక్ష!

Suryapet: సైబర్ బాధితులకు అండగా పోలీసు శాఖ సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాలు.. 'ఆపరేషన్ క్రాక్‌డౌన్' ద్వారా కేసుల నమోదు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 1 Sept 2026 5:54 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేటలో 'సైబర్ వారియర్స్' కు ప్రత్యేక శిక్షణ & సమీక్ష!

Suryapet: సైబర్ మోసాల బారిన పడ్డ బాధితులకు అండగా పోలీస్ శాఖ ఉంటుందని, పోగొట్టుకున్న డబ్బును రికవరీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ అన్నారు.

జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న సైబర్ వారియర్ సిబ్బందికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఒకరోజు ప్రత్యేక శిక్షణా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో సైబర్ నేరాల నియంత్రణ, రిఫండ్ ప్రక్రియ కోసం జిల్లా పోలీస్ కార్యాలయం నుండి జిల్లా సైబర్ సెక్యూరిటీ వింగ్ పనిచేస్తోందన్నారు. బాధితుల ఫిర్యాదులపై వెంటనే స్పందించి కేసులు నమోదు చేయాలని, నిందితులు, బాధితుల అకౌంట్ల వివరాలు, లింకులు కచ్చితంగా రికార్డు చేయాలని సైబర్ వారియర్స్ కు ఆదేశించారు. బ్యాంకు, కోర్టు అధికారులతో సమన్వయంతో పనిచేసి త్వరగా ఉత్తర్వులు వచ్చేలా కృషి చేయాలని సూచించారు.

ఆన్‌లైన్ పెట్టుబడులన్నీ ట్రాష్ అని ప్రజలు గ్రహించాలని, తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తుందనేది పూర్తిగా అవాస్తవమని అన్నారు. అలాంటి వెబ్‌సైట్లు, యాప్‌లన్నీ నకిలీవని, అత్యాశకు పోయి ఎవరూ ఆన్‌లైన్ పెట్టుబడి గేమ్స్ ఆడవద్దని, రక్షణ లేని మార్గాల్లో పెట్టుబడులు పెట్టవద్దని హెచ్చరించారు.

డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదని, అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు, ఓటీపీ, పిన్ వివరాలు ఇవ్వవద్దని సూచించారు. సైబర్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడం పోలీసుల ప్రాథమిక బాధ్యత అని, క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

అత్యాశకు పోయి అనుమానాస్పద ఆన్‌లైన్ వ్యాపారాలు నిర్వహిస్తూ, సైబర్ మోసగాళ్ల ద్వారా డబ్బులు పొందిన వారిపై ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’ ద్వారా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ, సైబర్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్ లక్ష్మినారాయణ, సైబర్ వారియర్ సిబ్బంది పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story