Suryapet: పనిమనుషులను పెట్టుకుంటున్నారా? ఎస్పీ నరసింహ హెచ్చరికలు వినాల్సిందే!
Suryapet: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ కీలక సూచనలు. ఇళ్లలో పనిమనుషులు, అద్దెదారుల వివరాలను పోలీసులకు తెలపాలని ఆదేశం.
Suryapet: పనిమనుషులను పెట్టుకుంటున్నారా? ఎస్పీ నరసింహ హెచ్చరికలు వినాల్సిందే!
సూర్యాపేట: జిల్లాలో నేరాల నియంత్రణ, దొంగతనాల నివారణలో భాగంగా ఇంట్లో పనిమనుషులను పెట్టుకునే ముందు, ఇళ్లను అద్దెకు ఇచ్చే ముందు వారి పూర్వాపరాలు తప్పనిసరిగా పరిశీలించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ప్రజలకు సూచించారు. నేపాల్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పని నిమిత్తం జిల్లాకు వచ్చేవారిని పనిలో పెట్టుకునే ముందు వారి గత చరిత్ర, నేర చరిత్ర తెలుసుకోవడం మంచిదని ఆయన అన్నారు. ఇలాంటి వారి వివరాలను స్థానిక పోలీసు స్టేషన్‌లో నమోదు చేయించి, సమాచారం అందించాలని కోరారు.
ఇటీవల ఇంట్లో పనిమనుషులుగా చేరిన వ్యక్తులు దోపిడీలు, దొంగతనాలు, దాడులకు పాల్పడిన ఘటనలు నమోదవుతున్నాయని ఎస్పీ తెలిపారు. కొందరు పథకం ప్రకారం పనిలో చేరి నేరాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. గుర్తింపు లేని, కొత్త వ్యక్తులను చేరదీస్తే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేర చరిత్ర ఉన్నవారిని పనిలో పెట్టుకోవద్దని, అనుమానిత వ్యక్తుల సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు, డయల్ 100 కు లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్లు 8712686026, 8712686057కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల రక్షణ కోసం జిల్లా పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు పనిచేస్తోందని ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు.




