Suryapet: పోలీస్ సేవలు ప్రజల చెంతకే – సూర్యాపేట ఎస్పీ నరసింహ ఐపీఎస్!
Suryapet: సూర్యాపేట గోపాలపురం కాలనీలో 'పోలీస్ ప్రజా భరోసా' అవగాహన సదస్సు. ఎస్పీ నరసింహ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై సైబర్ నేరాలు, సీసీ కెమెరాలపై అవగాహన.
Suryapet: పోలీస్ సేవలు ప్రజల చెంతకే – సూర్యాపేట ఎస్పీ నరసింహ ఐపీఎస్!
Suryapet: జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న ‘పోలీస్ ప్రజా భరోసా’ కార్యక్రమంలో భాగంగా, సూర్యాపేట పట్టణ గోపాలపురం కాలనీలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రజల వద్దకే పోలీస్ సేవలను చేర్చడం, ప్రజలకు భరోసా కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఎస్పీ తెలిపారు. మహిళలు, బాలల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఈ క్రమంలో ప్రతి పోలీస్ స్టేషన్కు ఒక ‘పోలీస్ అక్క’ను నియమించి బాధిత మహిళలకు అండగా ఉంటున్నామని చెప్పారు. ప్రజల భద్రత కోసం పోలీసులు రాత్రింబవళ్లు కాలనీలు, గ్రామాల్లో గస్తీ, నిఘా నిర్వహిస్తున్నారని వెల్లడించారు.
సామాజిక అంశాలపై కూడా విస్తృత అవగాహన కల్పించారు. సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాలు, గంజాయి నిర్మూలన, సోషల్ మీడియా ప్రభావం, సీసీ కెమెరాల వినియోగం, వృద్ధుల సంక్షేమం తదితర అంశాలపై మాట్లాడారు. అపరిచితులు ఫోన్ చేసి బ్యాంక్ వివరాలు అడిగితే సమాచారం ఇవ్వొద్దని, డబ్బులు అడిగితే పంపొద్దని సూచించారు. కాలనీకి కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
జిల్లా కేంద్రానికి 600 సీసీ కెమెరాలను అనుసంధానం చేసి నిత్యం పర్యవేక్షిస్తున్నామని, వృద్ధుల రక్షణ కోసం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీనియర్ సిటిజన్ భద్రత కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని, అతివేగం వల్ల ప్రాణనష్టం జరుగుతుందని గుర్తుచేశారు. గంజాయి, డ్రగ్స్ గురించి సమాచారం ఉంటే డయల్ 100, 112కు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా షీ టీమ్ సభ్యులు, పోలీస్ కళా బృందం ఆటపాటల ద్వారా మహిళల రక్షణ చట్టాలను సులభంగా ప్రజలకు వివరించారు.
కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, 36వ వార్డు కౌన్సిలర్ మన్సూర్ బి. ఫారూక్, ఎస్ఐలు యాదవేందర్ రెడ్డి, కనకరత్నం, షీ టీం ఎస్ఐ నీలిమ, పోలీస్ సిబ్బంది, కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




