Suryapet: సూర్యాపేటలో స్త్రీనిధి స్కామ్: వీఓఏను విధుల నుంచి తొలగించిన కలెక్టర్!

Suryapet: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామంలో రూ. 14.54 లక్షల స్త్రీనిధి నిధుల స్వాహా.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 28 July 2026 10:21 AM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేటలో స్త్రీనిధి స్కామ్: వీఓఏను విధుల నుంచి తొలగించిన కలెక్టర్!

సూర్యాపేట: మహిళా సంఘాల సభ్యుల సంక్షేమం కోసం ఉద్దేశించిన స్త్రీనిధి నిధులు పక్కదారి పట్టిన ఘటన తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ ఆర్థిక అవకతవకలకు పాల్పడటంతో రూ.14.54 లక్షల మేర మోసం జరిగినట్లు విచారణలో తేలింది.

2022లో గానుగబండ గ్రామ సమాఖ్యకు స్త్రీనిధి రుణాలు మంజూరయ్యాయి. అప్పటి నుంచి సభ్యులు తమ నెలవారీ వాయిదాలను క్రమం తప్పకుండా వీఓఏ సైదులుకు చెల్లిస్తూ వచ్చారు. అయితే సైదులు ఆ డబ్బును పూర్తిగా స్త్రీనిధి ఖాతాలో జమ చేయకుండా సొంత అవసరాలకు వాడుకున్నారు. సభ్యుల నుంచి ముందస్తు వాయిదాల పేరుతో అధికంగా వసూలు చేసి, బ్యాంకు రికార్డుల్లో మాత్రం కనీస మొత్తమే చూపించి మిగతా సొమ్మును స్వాహా చేసినట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం వీఓఏలు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకూడదు.

ఈ అక్రమాలపై ప్రజావాణిలో ఫిర్యాదులు అందడంతో ఈ ఏడాది మార్చిలో స్త్రీనిధి రీజినల్ మేనేజర్ శివప్రసాద్ విచారణ చేపట్టారు. విచారణలో వీఓఏ సైదులు అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో అతను స్వాహా చేసిన రూ.14,54,000ను తిరిగి స్త్రీనిధి ఖాతాలో రీపేమెంట్ చేయించారు.

విచారణలో వీఓఏతో పాటు ప్రస్తుతం ఉన్న ఆఫీస్ బేర్లు కూడా సహకరించినట్లు తేలింది. నిధులు దారి మళ్లుతున్నా పట్టించుకోకపోవడం, విచారణ సమయంలో సరిగ్గా స్పందించకపోవడంపై కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్థిక అవకతవకలకు పాల్పడిన వీఓఏ సైదులును తక్షణమే విధుల నుంచి తొలగించాలని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఆఫీస్ బేర్లను కూడా పదవుల నుంచి తీసేయాలని కలెక్టర్ డీఆర్డీవో పీడీ సన్యాసయ్యను ఆదేశించారు. అలాగే డీపీఎం బెనర్జీపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story