Suryapet: సూర్యాపేటలో భరోసా, షీ టీమ్ కేంద్రాలను సందర్శించిన యునిసెఫ్ బృందం

Suryapet: సూర్యాపేటలో భరోసా, షీ టీమ్ కేంద్రాలను యునిసెఫ్ బృందం సందర్శించింది. బాధితులకు అందుతున్న సేవలపై అదనపు ఎస్పీ రవీంద్ర రెడ్డితో చర్చ.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 29 Oct 2026 8:03 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేటలో భరోసా, షీ టీమ్ కేంద్రాలను సందర్శించిన యునిసెఫ్ బృందం

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలీసు భరోసా కేంద్రాన్ని యునిసెఫ్ బాలల రక్షణ బృందం చైల్డ్ ప్రొటెక్షన్ స్పెషలిస్ట్ సోనికుట్టి జార్జ్, టెక్నికల్ అడ్వైజర్ డా. ఫిలిప్స్ గురువారం సందర్శించారు.

అదనపు ఎస్పీ రవీంద్ర రెడ్డితో కలిసి భరోసా కేంద్రం, షీ టీం కార్యాలయాలను సందర్శించిన బృందం సభ్యులు, లైంగిక దాడుల్లో బాధితులుగా ఉన్న మహిళా, బాల బాధితులకు పోలీసు మహిళా భరోసా కేంద్రం ద్వారా ఎలాంటి సేవలు అందిస్తున్నారు, బాధితులకు తక్షణ సహాయం ఎలా అందిస్తున్నారు, వారి రక్షణ, పునరావాసం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆధ్వర్యంలో భరోసా, షీ టీం బృందాలు మహిళా, బాలల రక్షణలో పటిష్టంగా పని చేస్తున్నాయని తెలిపారు. లైంగిక దాడి కేసుల్లో బాధితులుగా ఉన్న మహిళలు, చిన్నారులకు అండగా నిలవడం, వారిలో సామాజిక ధైర్యం, భద్రత కల్పించడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

బాధితులు వివిధ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే చోట న్యాయపరమైన, వైద్యపరమైన, రక్షణపరమైన సేవలు అందించేందుకు భరోసా కేంద్రం పనిచేస్తోందని వివరించారు. బాధితులకు అవసరమైనప్పుడు కౌన్సెలింగ్, న్యాయపరమైన మార్గదర్శకత్వం అందిస్తున్నామని, బాధితుల పరిస్థితిని బట్టి వారికి అవసరమైన పునరావాసం కల్పించడం, అర్హులైన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్థిక సహాయం అందేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తున్నామని తెలిపారు.

భరోసా కేంద్రంలో నిర్వహిస్తున్న రికార్డ్స్, కౌన్సెలింగ్ విధానాన్ని పరిశీలించిన బృందం భరోసా పనితీరును అభినందించింది. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీంద్ర రెడ్డితో పాటు భరోసా టీం ఎస్ఐ మౌనిక, షీ టీం ఎస్ఐ నీలిమ, యునిసెఫ్ బృందం సభ్యులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA