Suryapet: సూర్యాపేటలో రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు, ధాన్యం సీజ్

Suryapet: సూర్యాపేట బాలెంలలోని రైస్ మిల్లులపై విజిలెన్స్, పౌర సరఫరాల శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు. రూ.69 కోట్ల విలువైన ధాన్యం కొరత గుర్తింపు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 23 July 2026 9:40 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేటలో రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు, ధాన్యం సీజ్

సూర్యాపేట: ప్రభుత్వ ధాన్యం అక్రమాలపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నల్గొండ జిల్లా విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, సూర్యాపేట జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారుల సంయుక్త బృందం జూలై 20న సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలోని వజ్ర రైస్ కార్పొరేషన్, వజ్ర వికాస్ రైస్ మార్ట్ రైస్ మిల్లులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.

తనిఖీల్లో భాగంగా వజ్ర వికాస్ రైస్ మార్ట్ నుంచి భారత ఆహార సంస్థకు సరఫరా చేయాల్సిన బియ్యాన్ని ముదిగొండలోని సత్యసాయి రైస్ కార్పొరేషన్ పేరుతో లారీల్లో లోడ్ చేస్తుండగా అధికారులు గుర్తించారు. వెంటనే ఆ ప్రక్రియను నిలిపివేసి సంబంధిత లారీలు, బియ్యం నిల్వలు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం ఇరు మిల్లుల్లో భౌతిక ధృవీకరణ చేపట్టారు. రికార్డుల ప్రకారం ఉండాల్సిన ధాన్యంతో పోలిస్తే పెద్ద ఎత్తున కొరత బయటపడింది. వజ్ర రైస్ కార్పొరేషన్‌లో 11,073.054 మెట్రిక్ టన్నులు, వజ్ర వికాస్ రైస్ మార్ట్‌లో 18,114.834 మెట్రిక్ టన్నుల ధాన్యం తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తంగా 29,187.888 మెట్రిక్ టన్నుల కొరత ఉందని నిర్ధారించారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఈ కొరత విలువ సుమారు రూ.69 కోట్లుగా లెక్క తేలింది.

జిల్లా పౌర సరఫరాల అధికారి సమక్షంలో పంచనామా నిర్వహించి, మిల్లుల్లో లభ్యమైన ధాన్యం, బియ్యం నిల్వలను సీజ్ చేశారు. సంబంధిత మిల్లులపై రికవరీ చర్యలు తీసుకోవడంతో పాటు చట్టపరంగా క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు చర్యలు ప్రారంభించారు. స్వాధీనం చేసిన ధాన్యాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇతర అనుమతి ఉన్న రైస్ మిల్లులకు తరలించాలని జిల్లా మేనేజర్, తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థను ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ మాట్లాడుతూ ప్రభుత్వ ధాన్యం, బియ్యం నిల్వలు, కస్టమ్ మిల్లింగ్, పీడీఎస్ వ్యవస్థలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story