Ananthagiri: అయ్యప్ప మాలధారణ విద్యార్థిపై ఉపాధ్యాయుడి దాడి.. ధర్నా!
Ananthagiri: అనంతగిరి మండలం అమీనాబాద్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అయ్యప్ప మాలధారణ విద్యార్థిపై ఉపాధ్యాయుడు దాడి చేశాడన్న ఆరోపణలపై హిందూ సంఘాలు ధర్నా నిర్వహించాయి.
Ananthagiri: అయ్యప్ప మాలధారణ విద్యార్థిపై ఉపాధ్యాయుడి దాడి.. ధర్నా!
అనంతగిరి: మండలం అమీనాబాద్ జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో అయ్యప్ప మాలధారణలో ఉన్న విద్యార్థిపై ఉపాధ్యాయుడు దాడి చేశారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటనను నిరసిస్తూ అమీనాబాద్, కోదాడ విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ ఆధ్వర్యంలో హిందూ సంఘాల నాయకులు, అయ్యప్ప స్వాములు పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు.
పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థి అయ్యప్ప మాల ధరించి దీక్షలో ఉన్నాడు. అయితే అదే పాఠశాలలో తెలుగు పండిట్‌గా పనిచేస్తున్న సైదులు అనే ఉపాధ్యాయుడు విద్యార్థిపై దాడి చేశారని హిందూ సంఘాల నాయకులు ఆరోపించారు. తాను నాస్తికుడినని, తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తానంటూ విద్యార్థిని కొట్టారని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులను నిలదీసినా సరైన సమాధానం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయ్యప్ప మాలధారణలో ఉన్న విద్యార్థులు తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీళ్లతో స్నానం చేస్తూ క్రమశిక్షణతో దీక్షను కొనసాగిస్తారని అయ్యప్ప స్వాములు పేర్కొన్నారు. అలాంటి దీక్షను అవమానించేలా మాట్లాడటం, విద్యార్థిపై దాడి చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టడంతో ఉపాధ్యాయుడు సైదులు అయ్యప్ప స్వాములకు క్షమాపణలు చెప్పినట్లు నాయకులు తెలిపారు. మరోవైపు విద్యాశాఖ అధికారులు తక్షణ చర్యల్లో భాగంగా ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీసు జారీ చేశారు.
అయితే షోకాజ్ నోటీసుతోనే చర్యలను పరిమితం చేయకుండా ఉపాధ్యాయుడు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, ఎంఈఓ స్థాయిలో పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ నాయకులు డిమాండ్ చేశారు.




