Munugode: 2028లో మునుగోడులో బీసీ ఎమ్మెల్యే పక్కా: తీన్మార్ మల్లన్న!

Munugode: మునుగోడులో తీన్మార్ మల్లన్న సంచలన ప్రసంగం చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు గ్రాడ్యుయేట్ ఓటే లేదని ఎద్దేవా చేస్తూ, 2028లో బీసీ బిడ్డే ఎమ్మెల్యే అవుతారని స్పష్టం చేశారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 3 Nov 2026 10:32 PM IST
Munugode
X

Munugode: 2028లో మునుగోడులో బీసీ ఎమ్మెల్యే పక్కా: తీన్మార్ మల్లన్న!

మునుగోడు: బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా 41వ రోజు పాదయాత్రగా తీన్మార్ మల్లన్న మునుగోడుకు చేరుకున్నారు. స్థానిక పార్టీ నాయకులు మల్లన్నకి ఘన స్వాగతం పలికారు. అనంతరం మునుగోడు సెంటర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మల్లన్న ప్రసంగించారు.మునుగోడు వేదికగా తీన్మార్ మల్లన్న అధికార, ప్రతిపక్ష నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మునుగోడు నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత పేద నియోజకవర్గమని, కానీ ఇక్కడి నుండి గెలిచే ఎమ్మెల్యేలు మాత్రం కోట్లకు పడగెత్తిన ధనికులని ధ్వజమెత్తారు.

"ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను మనసు చంపుకొని దళితుడైన ఉప ముఖ్య మంత్రి దగ్గరకు పోయానని చెప్తున్నాడని, మరి ఇన్నాళ్లూ మా గొల్ల, కురుమల దగ్గరకు వచ్చినప్పుడు మీ మనసు చచ్చిపోలేదా?" అని నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో బీసీ బిడ్డలు రైలు పట్టాలపై పడి ప్రాణాలు అర్పిస్తే, పదేళ్ల కాలంలో పదవులు, ఆస్తులు అనుభవించింది మాత్రం రెడ్డి,వెలమ కులాల నేతలేనని మండిపడ్డారు

కోమటిరెడ్డి బ్రదర్స్ కి పట్టభద్రుల ఓటే లేదు!..

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రస్తావిస్తూ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కానీ, ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కానీ అస్సలు పట్టభద్రుల ఓటే లేదని ఎద్దేవా చేశారు. "గ్రాడ్యుయేట్ ఓటే లేని నేతలు మన ఓట్లు ఎలా అడుగుతారు? మీ ఓట్లు మాకు వద్దే వద్దు. మీ సోపతీ వద్దు. బొందలగడ్డ దగ్గర ఉండే సోపతి కూడా మీతో మాకు లేదు. మా బొందలు వేరు.. మీ బొందలు వేరు" అని స్పష్టం చేశారు.

తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున బిసి బిడ్డ, ఉపాధ్యాయుడు పాలకూరి అశోక్ సార్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టామని ప్రకటిస్తూ, బీసీల ఐక్యత కోసం తన సొంత ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా త్యాగం చేసి అశోక్ సార్ కు కేటాయించానని తెలిపారు. గ్రాడ్యుయేట్ స్థానంలో మొత్తం 15లక్షల ఓట్లలో బీసీల ఓట్లే అత్యధికంగా 8లక్షలు ఉన్నాయని, రెడ్ల ఓట్లు జల్లెడ పట్టినా 2 లక్షలు కూడా లేవని స్పష్టం చేశారు.

లక్షమంది లేని వెలమలకు 13 సీట్లు.. 2 కోట్ల బీసీలకు తిప్పలు!

రాష్ట్రంలో కులాల వారీగా ఉన్న జనాభా, వారికి దక్కుతున్న రాజకీయ ప్రాతినిధ్యంపై మల్లన్న పక్కా లెక్కలు బయటపెట్టారు.వెలమ సామాజికవర్గం వారు రాష్ట్రంలో లక్ష మంది కూడా లేరు, కానీ ఏకంగా 13 మంది ఎమ్మెల్యేలుఉన్నారు.రెడ్డి సామాజికవర్గం వారు 10 లక్షల మంది కంటే తక్కువ జనాభా ఉన్నారు, కానీ 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. ఇగ 2 కోట్లకు పైగా జనాభా ఉన్న బీసీలు మాత్రం ఒక చిన్న MPTC టికెట్ కోసం పార్టీల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.బీసీ నేతలంతా కేవలం రెండు రోజులు తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తే, రెడ్ల గుండెలాగిపోతాయని అన్నారు..

ప్రభుత్వ పథకాల్లో తీవ్ర వివక్ష.. పథకాల్లేవు.. భూముల్లేవు!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ లెక్కల ఆధారంగానే తాను మాట్లాడుతున్నానని చెబుతూ పథకాల పంపిణీలో జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు.ప్రతి రెడ్డి కుటుంబానికి సగటున 1.25 ఎకరాల భూమి ఉంది కానీ యాదవులకు సగటున అర ఎకరం, ముదిరాజులకు అర ఎకరం కంటే తక్కువ, గౌడ సోదరులకు పావు ఎకరం మాత్రమే ఉందని,ఇది సామాజిక న్యాయం ఎలా అవుతుందని అన్నారు.

రైతు బంధు, సబ్సిడీలు, ఉచిత కరెంట్ ద్వారా ప్రతి రెడ్డి ఇంటికి ₹5,94,000 అందుతుండగా.. యాదవుల ఇంటికి ₹3,50,000, ముదిరాజుల ఇంటికి ₹2,45,000, గౌడల ఇంటికి ₹2,23,000 మాత్రమే వస్తున్నాయన్నారు. రైతు భరోసా రెడ్డి ఇంటికి ₹14,000 పోతే, బీసీ ఇంటికి ₹3,800 మాత్రమే వస్తోంది.ఉచిత కరెంట్ రెడ్డి ఇంటికి ₹12,900 సొమ్ము పోతే, బీసీ ఇంటికి కేవలం ₹2,267 వస్తోందని,యూరియా సబ్సిడీ రెడ్డి ఇంటికి ₹6,476 పోతే, బీసీ ఇంటికి ₹3,832 అందుతోందని లెక్కలతో వివరించారు.ఇక రైతు బీమా రెడ్డి ఇంటికి ₹1,157 లబ్ధి చేకూరితే, బీసీలకు ₹403 మాత్రమే వస్తోంది ఆవేదన వ్యక్తం చేశారు

ఆర్బీఐ (RBI) అప్పుల భారం..

రైతు భరోసా కోసం ప్రభుత్వం తెచ్చిన ₹9,000 కోట్ల అప్పులో.. బీసీల నెత్తిపై ఏకంగా ₹5,500 కోట్ల అప్పు భారం పడితే, బీసీ రైతులకు పంచింది ₹4,050 - ₹4,100 కోట్లు మాత్రమే అని,కానీ రెడ్లకు ₹720 కోట్ల అప్పు పడితే, వారికి పంచిన సహాయం మాత్రం ₹3,900 కోట్లు అని మల్లన్న లెక్కలతో సహా వివరించారు.

-ఈడబ్ల్యూఎస్ (EWS) పేరుతో ఉద్యోగాల దోపిడీ..బీసీల రిజర్వేషన్ల మోసం!

రాష్ట్రంలో 5 శాతమే ఉన్న రెడ్లు,వెలమల కులాలకు EWS ద్వారా 10% రిజర్వేషన్లు దొంగతనంగా కట్టబెట్టారని మండిపడ్డారు. EWS వల్ల రెడ్డి,వెలమలకు 50 మార్కులు వచ్చినా వారికి ఉపాధ్యాయ కొలువులు వస్తుంటే, 60% ఉన్న బీసీల బిడ్డలకు (గౌడ, ముదిరాజ్, యాదవ, పద్మశాలి) 70 మార్కులు వచ్చినా ఉద్యోగాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో 42% బీసీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి, అసెంబ్లీలో దొంగ బిల్లు ప్రవేశపెట్టి బీసీల నోట్లో మన్ను కొట్టారని, దీనిపై అసెంబ్లీలోనే తానే నిలదీశానని గుర్తుచేశారు.

బీసీ బడ్జెట్ ₹60,000 కోట్లు ఏమైనట్టు?

ఏడాదికి ₹20,000 కోట్ల చొప్పున మూడేళ్లలో బీసీలకు ఖర్చు చేయాల్సిన ₹60,000 కోట్లలో ప్రభుత్వం ఖర్చు చేసింది ₹2,000 కోట్లు మాత్రమేనని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల పత్రాన్ని ప్రదర్శిస్తూ నిరూపించారు:

స్కాలర్‌షిప్‌లు:₹1,650 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం ₹198 - ₹365 కోట్లు మాత్రమే ఇచ్చి, మిగతా సొమ్మును రెడ్డి కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు.

స్టడీ సర్కిళ్లు: 50 స్టడీ సర్కిళ్ల కోసం ₹50 కోట్లు కేటాయించి, ఖర్చు చేసింది కేవలం ₹4 కోట్లే.

చేనేత కార్మికులు:** ₹450 కోట్లకు గాను కేవలం ₹168 కోట్లు ఇచ్చి, ₹300 కోట్లు దారిమళ్లించారు.

గీత కార్మికులు (గౌడలు):** ₹70 కోట్లకు గాను ₹19 కోట్లు ఇచ్చి, ₹50 కోట్లు దొంగిలించారు.

కళ్యాణలక్ష్మి:** ₹2,173 కోట్లు రావాల్సి ఉంటే ₹108 కోట్లు ఇచ్చి, దాదాపు ₹2,000 కోట్లు దారిమళ్లించారు.

గొర్రెల పంపిణీ:21 గొర్రెలతో కోటీశ్వరులవుతారని నమ్మించి గొర్రెలను మాయం చేశారన్నారు మండిపడ్డారు

-మునుగోడు ఓట్ల లెక్కలు..

మునుగోడులో మొత్తం 2,52,699 ఓట్లు ఉంటే, అందులో రెడ్ల ఓట్లు కేవలం 18,433 మాత్రమే. కానీ బీసీల ఓట్లు 1,37,000 ఉన్నాయని లెక్కలు వివరించారు.18,000 ఓట్లు ఉన్న రెడ్లకు సొంతంగా పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదని, బీసీల ఓట్లతో గెలిచి బీసీల నిధులే దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కత్తెర గుర్తు పవర్...టీఆర్పీ ఎన్నికల గుర్తు

చేతి గుర్తు రెడ్లకు, కారు గుర్తు వెలమలకు పరిమితమైతే, బీసీల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ 'కత్తెర' గుర్తుతో ముందుకు వచ్చిందని తెలిపారు.నాయి బ్రాహ్మణుడు జుట్టు కత్తిరించాలన్నా, యాదవుడు గొర్లకు ఉన్ని కత్తిరించాలన్నా, మేరన్న టైలర్ బట్టలు కత్తిరించాలన్నా, షాపుల ప్రారంభోత్సవాలకైనా కత్తెరే కావాలని.. అలాగే అగ్రకుల అహంకార తోకలు కత్తిరించాలన్నా కత్తెరే సమాధానమని స్పష్టం చేశారు.2028 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు గడ్డపై మొట్టమొదటిసారిగా బీసీ ఎమ్మెల్యే గెలవడం ఖాయమని, తెలంగాణలో బీసీల రాజ్యాధికార ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు వైద్యం వెంకటేశ్వర్లు,మునుగోడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సతీష్ బాబు, పార్టీ జాతీయ వ్యవహారాల ఇన్చార్జ్ పూజిత, కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు అరుణ,పార్టీ నాయకులు కంటాల యాదగిరి,శేఖర్,రాణి,గొల్లకుర్మ సంఘం నాయకులు, పార్టీ కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET