Suryapet: ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా పథకం ద్వారా ప్రజా ప్రభుత్వం భరోసా

Suryapet: పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోంది.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 15 Nov 2026 11:20 PM IST
Suryapet
X

Suryapet: ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా పథకం ద్వారా ప్రజా ప్రభుత్వం భరోసా

సూర్యాపేట: పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కుటుంబానికి ఆధారంగా నిలిచే కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా అండగా నిలిచేందుకు ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ను ప్రవేశపెడుతోంది.

కుటుంబ పెద్దను కోల్పోయిన విషాద సమయంలో ఆ కుటుంబం జీవనోపాధి కోసం ఇతరులపై ఆధారపడకుండా, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.

మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా రక్షణ కల్పించే దిశగా చేపట్టిన ఈ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

కుల మతాలకు అతీతంగా ప్రతి కుటుంబానికి అవకాశం

ఈ పథకంలో కులం, మతం, ఆదాయం వంటి భేదాలు లేకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి బీమా రక్షణ కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన కుటుంబ సంపాదన సభ్యుడిని బీమా పరిధిలోకి తీసుకోనున్నారు. ఒక కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నట్లయితే, వారిలో ఎవరికి బీమా రక్షణ కల్పించాలనేది కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవచ్చు.

బీమా పొందే వ్యక్తి తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని లేదా పలువురిని నామినీలుగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. రూ.5 లక్షలను నామినీలకు ఏ నిష్పత్తిలో పంపిణీ చేయాలనే విషయాన్ని కూడా కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవచ్చు. అర్హుల గుర్తింపునకు ఆధార్ కార్డులో నమోదైన పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకోనున్నారు.

నవంబర్ 14 నుంచి 18 వరకు విస్తృత ప్రచారం, 19 నుంచి నమోదు

పథకం ప్రారంభానికి ముందుగా నవంబర్ 14 నుంచి 18 వరకు గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డప్పు చాటింపు, దండోరా ద్వారా ప్రతి ఇంటికి పథకం వివరాలను చేరవేయనున్నారు.

నవంబర్ 19న పథకం ప్రారంభమైన అనంతరం గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. నమోదు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారు. నమోదు పూర్తయిన తర్వాత వివరాలను కుటుంబ సభ్యులకు చదివి వినిపించి, వారి అంగీకారంతోనే ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

సూర్యాపేట జిల్లాలో 3,29,974 కుటుంబాలకు లబ్ది

సూర్యాపేట జిల్లాలో ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని 23 మండలాల పరిధిలో 486 గ్రామ పంచాయతీల ద్వారా 2,41,188 కుటుంబాలకు, ఐదు మున్సిపాలిటీల పరిధిలోని 141 వార్డుల ద్వారా 88,746 కుటుంబాలకు పథకంపై అవగాహన కల్పించనున్నారు. మొత్తం 3,29,974 కుటుంబాలకు పథకం వివరాలు చేరేలా కార్యాచరణ రూపొందించారు.

ఈ పథకం గురించి కలెక్టర్ మాట్లాడుతూ కుటుంబాన్ని పోషించే వ్యక్తికి అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. పిల్లల చదువులు, కుటుంబ పోషణ, ఇతర అత్యవసర అవసరాలకు ఈ బీమా మొత్తం ఆర్థికంగా తోడ్పడుతుందని తెలిపారు.

ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA