Maddirala: సూర్యాపేట జిల్లా మద్దిరాలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల డ్రా రసాభాస!
Maddirala: సూర్యాపేట జిల్లా మద్దిరాలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల డ్రా రసాభాస అనర్హులకే కేటాయింపులపై గ్రామస్తుల ఆగ్రహం.. పోలీసులతో తోపులాట, రీసర్వే చేయాలని బాధితుల డిమాండ్.
Maddirala: సూర్యాపేట జిల్లా మద్దిరాలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల డ్రా రసాభాస!
మద్దిరాల: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు కోసం అధికారులు చేపట్టిన డ్రా ప్రక్రియ ఉద్రిక్తంగా మారింది. మొత్తం 63 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను 63 మంది లబ్ధిదారులకు డ్రా పద్ధతిలో కేటాయించగా, ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. అర్హులకు కాకుండా అనర్హులకు ఇళ్లు కేటాయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఆందోళనను పోలీసులు చెదరగొట్టి పలువురు నిరసనకారులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అర్హులైన నాకు ఇల్లు ఎందుకు కేటాయించలేదు: షేక్ సోహెల్
ఈ సందర్భంగా షేక్ సోహెల్ మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అనర్హులకే కేటాయించారని ఆరోపించారు. మొత్తం 63 మందికి ఇళ్లు కేటాయించగా, లిస్టులో 59వ క్రమసంఖ్యలో తన పేరు ఉన్నప్పటికీ తనకు ఇల్లు ఎలా కేటాయించలేదని ప్రశ్నించారు. గ్రామంలో నివాసం లేని వారు, ఇతర గ్రామాలకు చెందిన వారు, నాయకుల బంధువులు, డబ్బులు చెల్లించిన వారు, ఇప్పటికే ఇళ్లు, ఆస్తులు ఉన్న కుటుంబాలకు ఇళ్లు కేటాయించారని ఆరోపించారు.
ఎమ్మెల్యే మందుల సామేలు స్పందించి ప్రస్తుత లిస్టును రద్దు చేసి, అధికారులు మళ్లీ సమగ్రంగా రీసర్వే నిర్వహించి నిజమైన అర్హులను గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
అర్హురాలినైన నాకు ఇల్లు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: షబానా
షేక్ షబానా మాట్లాడుతూ.. తనకు ఉండేందుకు సొంత ఇల్లు లేదని, కనీసం గుంట భూమి కూడా లేదని తెలిపారు. ఎలాంటి స్థిరాస్తులు లేకుండా బజ్జీల బండి నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించలేదని, భూములు, ఇళ్లు ఉన్నవారికి కేటాయించారని ఆరోపించారు.
తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని షబానా హెచ్చరించారు. ఎమ్మెల్యే మందుల సామేలు ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించి న్యాయం చేయాలని కోరారు. అవసరమైతే న్యాయం కోసం ముఖ్యమంత్రి వద్దకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
రీసర్వే చేసి అర్హులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుపై గ్రామస్తులు మాట్లాడుతూ.. నిజమైన నిరుపేదలకు ఇళ్లు దక్కలేదని ఆరోపించారు. గ్రామపంచాయతీ సిబ్బంది, సర్పంచ్ బంధువులు, కొందరు నాయకులకు ఇళ్లు కేటాయించారనే ఆరోపణలు చేశారు. షేక్ సోహెల్, షేక్ షబానా అర్హులైనప్పటికీ వారికి ఇళ్లు కేటాయించలేదని పేర్కొన్నారు.
ప్రస్తుత లబ్ధిదారుల జాబితాను పునఃపరిశీలించి, పారదర్శకంగా రీసర్వే నిర్వహించి నిజమైన అర్హులను గుర్తించాలని గ్రామస్తులు అధికారులను కోరారు.




