Thirumalagiri: వ్యవసాయ విద్యుత్ కోతలపై తిరుమలగిరిలో రైతుల ధర్నా
Thirumalagiri: వ్యవసాయ విద్యుత్ కోతలను నిరసిస్తూ తిరుమలగిరిలో రైతులు, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ పాల్గొన్నారు.
Thirumalagiri: వ్యవసాయ విద్యుత్ కోతలపై తిరుమలగిరిలో రైతుల ధర్నా
తిరుమలగిరి, సూర్యాపేట జిల్లా: వ్యవసాయానికి విద్యుత్ కోతలు విధించడాన్ని నిరసిస్తూ తిరుమలగిరి పట్టణంలో రైతులు, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు. మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు అందక, విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. గతంలో తుంగతుర్తి నియోజకవర్గానికి కాళేశ్వరం ద్వారా నీటిని అందించినప్పటికీ ప్రస్తుతం ఆ నీళ్లు కనిపించడం లేదని, రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రస్తుతం పంటలు పొట్ట దశలో ఉన్నాయని, ఈ కీలక సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తే పంటలను కాపాడుకునే అవకాశం ఉందని కిశోర్ కుమార్ అన్నారు. అయితే ప్రభుత్వం విద్యుత్ సరఫరాపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో పంటలు రైతుల కళ్ల ముందే ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎండిపోయిన పంట పొలాలు, నెర్రలు వారిన నేలలు, రైతుల కన్నీళ్లే కనిపిస్తున్నాయని అన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయినప్పటికీ వాటి స్థానంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడంలో అధికారులు, ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.
యాదాద్రి పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి చేయాలి
యాదాద్రి పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం కావాలనే ఉత్పత్తి చేయడం లేదని గాదరి కిశోర్ కుమార్ ఆరోపించారు. సాగునీరు, విద్యుత్ కొరతతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడిందని అన్నారు.
రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, పంటలు ఎండిపోకుండా వ్యవసాయానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ రూ.50 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని డా. గాదరి కిశోర్ కుమార్ ఆరోపించారు. అవినీతికి సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తామని అన్నారు. రైతుల ఆవేదన, ఉసురు ప్రభుత్వానికి తప్పక తగులుతుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగిస్తే ప్రజా క్షేత్రంలోనే తగిన శిక్ష తప్పదని ఆయన అన్నారు. రైతుల పక్షాన బీఆర్‌ఎస్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.




