Tungaturthi: తొండలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్
Tungaturthi: తుంగతుర్తి నియోజకవర్గం తొండ వద్ద రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే మందుల సామేల్ వెల్లడించారు.
Tungaturthi: తొండలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్
సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి నియోజకవర్గం తొండ గ్రామం హైవే రోడ్డు పక్కన రూ.200 కోట్ల భారీ వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నట్లు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితో ఈ పాఠశాల నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు.
ఈ పాఠశాల అందుబాటులోకి వస్తే కులమతాలకు అతీతంగా పేద విద్యార్థులందరికీ కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించే అవకాశం కలుగుతుందని వివరించారు. అగ్రవర్ణాలకు చెందిన పేద పిల్లలతో పాటు అన్ని వర్గాల పేద విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యనభ్యసించవచ్చని ప్రతి విద్యా సంవత్సరంలో సుమారు 2,600 మంది విద్యార్థులు చదువుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు వివిధ రకాల సాంకేతిక విద్యను కూడా అందించనున్నట్లు వెల్లడించారు. ఈ పాఠశాల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అడ్డగూడూరులో రూ.7.80 కోట్లతో ఏటీసీ
విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. గతంలో అటగూడూరులో రూ.7.80 కోట్ల వ్యయంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) ప్రారంభించినట్లు గుర్తుచేశారు. దీని ద్వారా యువతకు సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధికి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
త్వరలో జూనియర్ కళాశాల నిర్మాణం
జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. దసరా తర్వాత భూమిపూజ నిర్వహించి జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.విద్యా రంగంలో చేపడుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు యువతకు మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేస్తాయని పేర్కొన్నారు.




