Suryapet: తెలంగాణలో సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి!

Suryapet: తెలంగాణలో సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (OPS) తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేటలో జరిగిన జనజాగరణ

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 14 July 2026 10:17 PM IST
Suryapet
X

Suryapet: తెలంగాణలో సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి!

సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థిత ప్రజ్ఞ డిమాండ్ చేశారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు లక్కపాక ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనజాగరణ యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూలై 11న ప్రారంభమైన జనజాగరణ యాత్ర రాష్ట్రంలోని 33 జిల్లాలు, 119 నియోజకవర్గాల్లో కొనసాగుతోందని తెలిపారు. 207 జాయింట్ యాక్షన్ కమిటీ సంఘాలు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల మద్దతుతో ఈ యాత్ర సాగుతోందన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు హిమాచల్ ప్రదేశ్‌లో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించినట్లే తెలంగాణలోనూ అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచినా పాత పెన్షన్ అమలుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

రాష్ట్రంలో సుమారు 2.6 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా శాసనసభ్యులకు వినతిపత్రాలు అందజేస్తున్నామని చెప్పారు. 30 ఏళ్ల సేవ అనంతరం కూడా సీపీఎస్ ఉద్యోగులకు రూ.5 వేల నుంచి రూ.6 వేల లోపు మాత్రమే పెన్షన్ వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పదవీ విరమణ పొందిన సుమారు 2,000 మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

రిటైర్ అయిన సీపీఎస్ ఉద్యోగులకు ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్) కింద ఉచిత వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. డీఏ బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అందలేదన్నారు. ఉద్యోగుల బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వం విడుదల చేయనున్న నిధుల్లో సీపీఎస్ ఉద్యోగుల బకాయిలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

ఆగస్టు 23న హైదరాబాద్‌లో నిర్వహించే "ఛలో హైదరాబాద్" కార్యక్రమ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టీఎస్ సీపీఎస్ ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, జిల్లా కోశాధికారి గుయ్యాని ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ యూసుఫ్, సంయుక్త కార్యదర్శి నారాయణదాసు సతీష్ కుమార్, మామిడి సురేందర్, చిట్యాల సతీష్, సురభి శేఖర్, వీరారెడ్డి, షఫీ, మౌనిష్, పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు తంగేళ్ల జితేందర్ రెడ్డి, టి యు టిఎఫ్ జిల్లా అధ్యక్షుడు మామిడి అరవిందు, ప్రధాన కార్యదర్శి కిషన్ ప్రసాద్, బి సి టి యు రాష్ట్ర అధ్యక్షులు బెల్లంకొండ రామ్మూర్తి, వెంకట్ రెడ్డి, దండుగుల మల్లయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story