Kodad: రూ. 80 లక్షల అప్పుకు 80 ఎకరాలు కాజేసిన వడ్డీ వ్యాపారి!
Kodad: సూర్యాపేట జిల్లా కోదాడ పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులు ధర్నా చేపట్టారు.
Kodad: రూ. 80 లక్షల అప్పుకు 80 ఎకరాలు కాజేసిన వడ్డీ వ్యాపారి!
కోదాడ hmtv: వడ్డీకి డబ్బులిచ్చి, అమాయక ప్రజల భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడంటూ ఓ వడ్డీ వ్యాపారిపై బాధితులు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.
మేళ్లచెరువు మండలం వేపలసింగారం గ్రామానికి చెందిన జక్కుల శంబయ్య అనే వడ్డీ వ్యాపారి హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని సుమారు 40 మంది నిరుపేదల వద్ద నుంచి రూ.80 లక్షలకు పైగా రుణాలు అందించాడు.ఈ రుణాలకు భద్రతగా సుమారు 80 ఎకరాల భూములను తనఖా పేరుతో తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు బాధితులు ఆరోపించారు.
తాము తీసుకున్న అసలు,వడ్డీ చెల్లించేందుకు సంబయ్య వద్దకు వెళ్తే పైగా తమపైనే తిరిగి అక్రమ కేసులు నమోదు చేస్తున్నాడని బాధితులు వాపోయారు. ఈ మోసంపై బాధితులు డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డిని ఆశ్రయించినప్పటికీ స్పందన కరువైందని, తమకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విసిగిపోయిన బాధితులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.
ఈ ఆందోళన కారణంగా కోదాడ పట్టణంలో కొంత మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు జోక్యం చేసుకుని బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మోసానికి పాల్పడిన వడ్డీ వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకుని, తమ భూములు తమకు ఇప్పించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.




