Huzurnagar: హామీలు అమలు చేసే వరకు సమ్మె విరమించం: ఆశా వర్కర్లు
Huzurnagar: ఎన్నికల హామీలు అమలు చేసే వరకు ఈ నెల 15 నుంచి నిరవధిక సమ్మె విరమించబోమని ఆశా వర్కర్లు స్పష్టం చేస్తూ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
Huzurnagar: హామీలు అమలు చేసే వరకు సమ్మె విరమించం: ఆశా వర్కర్లు
సూర్యాపేట జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. హామీలు ఇచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు వాటిని అమలు చేయకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ ఆశా వర్కర్లను కంటికి రెప్పలా కాపాడుకున్నారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జీతాలు సక్రమంగా చెల్లించడంలోనే నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం ప్రమాద బీమా గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ఆశా వర్కర్లు ప్రకటించారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సమ్మెకు ప్రజలు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపి ఆశా వర్కర్లకు అండగా నిలవాలని కోరారు.
ఈ మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డిని ఆశా వర్కర్లు, వారి అనుబంధ సంఘాల నాయకులు కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయనకు వినతిపత్రం అందజేసి, తమ సమ్మెకు మద్దతు ప్రకటించాలని కోరారు.
హుజూర్‌నగర్ నియోజకవర్గ కార్మిక సంఘం అధ్యక్షుడు పచ్చిపాలు ఉపేందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారి డిమాండ్ల సాధనకు సహకరించాలని నాయకులు కోరారు.




