Suryapet: కొహాన్స్ ఫార్మాలో రియాక్టర్ పేలుడు..చికిత్స పొందుతూ కార్మికుడు మృతి!
Suryapet: సూర్యాపేట కొహాన్స్ ఫార్మాలో రియాక్టర్ పేలుడు ప్రమాదంలో గాయపడిన కార్మికుడు వెంకన్న మృతి చెందాడు.
Suryapet: కొహాన్స్ ఫార్మాలో రియాక్టర్ పేలుడు..చికిత్స పొందుతూ కార్మికుడు మృతి!
Suryapet: సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొహాన్స్ ఫార్మా పరిశ్రమలో మూడు రోజుల క్రితం జరిగిన రియాక్టర్ పేలుడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకన్న అనే కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో కార్మికుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయని, అయితే ఆ వివరాలను కంపెనీ యాజమాన్యం దాచిపెడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపిస్తూ సీపీఐ, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ నాయకులు, స్థానిక గిరిజనులు, గ్రామస్తులు కంపెనీ ఎదుట పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు.
నాణ్యమైన మెటల్ పైపులకు బదులు నాసిరకం ప్లాస్టిక్ పైపులు వాడటం వల్లే ప్రెషర్ తట్టుకోలేక రియాక్టర్ పైపులు పగిలి ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాలు ఆరోపించాయి. గతంలోనూ పలుమార్లు ఇలాంటి ప్రమాదాలు జరిగినా యాజమాన్యం, అధికార యంత్రాంగం పట్టించుకోలేదని మండిపడ్డారు.
ఇతర ప్రాంతాల్లో వ్యతిరేకత వచ్చిన ప్రాణాంతక ప్రొడక్టులను ఇక్కడికి తీసుకొచ్చి ఉత్పత్తి చేస్తూ భూగర్భ జలాలు, గాలి, భూమిని తీవ్రంగా కలుషితం చేస్తున్నారని, దీంతో స్థానిక ప్రజలు కిడ్నీ సంబంధిత రోగాలతో అల్లాడుతున్నారని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరిహారంతో పాటు అదనంగా మరో రూ.2 కోట్లు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ప్రమాదానికి కారణమైన కంపెనీని జనావాసాల నుంచి తరలించి శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం పోరాటం ఆపేది లేదని, రేపు జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహిస్తామని వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు.




