1991 RBI Gold Airlift: భారత్ సీక్రెట్ గోల్డ్ ఆపరేషన్ః దేశ ఆర్థిక మూలాలు మార్చిన 47 టన్నుల బంగారం కథ
కుంటుంబ గౌరవాన్ని కాపాడే బంగారం 1991లో దివాళా పరిస్థితుల నుంచి దేశాన్ని కూడా కాపాడింది.
1991 RBI Gold Airlift: భారతదేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు. అదొక సెంటిమెంట్, కుటుంబ గౌరవం, ఆపదలో ఆదుకునే పరమ పవిత్రమైన ఆస్తి. అలాంటిది, దేశ సార్వభౌమాధికారానికి ప్రతిరూపమైన ప్రభుత్వ ‘బంగారు నిల్వలను’ రహస్యంగా విమానం ఎక్కించి విదేశాలకు పంపించాల్సి వస్తే? ఊహించడానికే కష్టంగా ఉన్నా, 1991 వేసవి కాలంలో భారతదేశం సరిగ్గా ఇలాంటి ఒక గడ్డుకాలాన్ని ఎదుర్కొంది. దేశం దివాలా తీసే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 46,910 కిలోల బంగారాన్ని బ్రిటన్‌కు విమానంలో తరలించి, అత్యవసరంగా 405 మిలియన్ డాలర్ల రుణాన్ని సేకరించింది. భారతదేశ ఆర్థిక చరిత్రను శాశ్వతంగా మార్చేసి, ఆర్థిక సంస్కరణలకు పునాది వేసిన ఆ ‘రహస్య ఆపరేషన్’ కథేంటో విశ్లేషణాత్మకంగా తెలుసుకుందాం.
ఆర్థిక సంక్షోభం ఎందుకు వచ్చింది?
1980 చివరిలో 1990 ప్రారంభంలో భారతదేశం తీవ్రమైన ‘బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్’ అంటే విదేశీ మారకద్రవ్యం సంక్షోభంలో కూరుకుపోయింది. దీనికి పలు కారణాలున్నాయి. 1991 జనవరిలో జరిగిన గల్ఫ్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో కువైట్, ఇరాక్ దేశాల్లో పనిచేసే భారతీయులు స్వదేశానికి పంపే నిధులు చాలా వరకు ఆగిపోయాయి. దీంతో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చింది. 1991 మే నాటికి కేవలం ఒక వారానికి సరిపడా దిగుమతులకు అవసరమైన బిల్లులు చెల్లించడానికి మాత్రమే ధనం మిగిలి ఉంది. విదేశీ మారకద్రవ్యం తగ్గిపోవడంతో అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు భారత క్రెడిట్ రేటును తగ్గించాయి. దీంతో విదేశీ బ్యాంకులు అప్పు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ధరఖాస్తు చేసినా తిరస్కరణే ఎదురైంది.
రహస్య ఆపరేషన్ - ముంబై ఎయిర్‌పోర్టులో ఏం జరిగింది?
అప్పటి తాత్కాలిక ప్రధానమంత్రి చంద్రశేఖర్ ప్రభుత్వం, ఆర్‌బీఐ గవర్నర్ ఎస్. వెంకటరమణన్ నేతృత్వంలో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రతిష్ట కంటే దివాలా తీయకుండా కాపాడుకోవడమే ముఖ్యమని భావించి, ఆర్‌బీఐ వద్ద ఉన్న బంగారాన్ని కుదువ పెట్టాలని నిర్ణయించారు. దీనికోసం రెండు దశల్లో ఓ ఆపరేషన్‌ను నిర్వహించారు. మొదటి దశ ఆపరేషన్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా 20 టన్నుల జప్తు చేసిన బంగారాన్ని స్వట్జర్లాండ్ బ్యాంకులో తాకట్టుపెట్టి 215 మిలియన్ డాలర్లు తెచ్చారు. ఇది 1991 మే నెలలో జరిగింది. ఆ తరువాత 1991 జులైలో ఆర్బీఐ తన సొంత నిల్వల నుంచి 46.91 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు తరలించింది.
జూలై 4, 1991న మొదటి విమానం ముంబైలోని శాంతాక్రూజ్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. ఆర్‌బీఐ వాల్టుల నుంచి భారీ ట్రక్కులలో, సాయుధ బలగాల కాపలా మధ్య ఈ బంగారాన్ని విమానాశ్రయానికి చేర్చారు. కస్టమ్స్ నిబంధనల నుంచి ప్రత్యేక మినహాయింపులు తీసుకుని మరీ ఈ ఆపరేషన్ పూర్తి చేశారు. అయితే, జూలై 8, 1991న ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రికలో జర్నలిస్ట్ శంకర్ అయ్యర్ ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించడంతో దేశం మొత్తం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.
1991 సంక్షోభం వర్సెస్ 2026 నాటి భారత్
ఆనాడు దేశాన్ని కాపాడిన ఈ కఠిన నిర్ణయం వల్లే, ఆ తర్వాత వచ్చిన పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేస్తూ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోగలిగింది. బంగారాన్ని విదేశాలకు పంపించాల్సి రావడం చాలామందికి అవమానంగా అనిపించింది. కానీ ఆ నిర్ణయం తీసుకోకపోతే దేశం అంతర్జాతీయ అప్పులు చెల్లించలేని స్థితికి వెళ్లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆరోజు ఆ సీక్రెట్ గోల్డ్ ఆపరేషన్ నిర్వహించబట్టే ఈరోజు భారత్ అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నది.
ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక
ఆనాటి గల్ఫ్ యుద్ధం లాగే, ప్రస్తుత 2026 కాలంలో మధ్యప్రాచ్యంలో జరుగుతున్న అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ వాతావరణం మళ్లీ చమురు ధరలను పెంచుతోంది. భారతదేశం కేవలం 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 72 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ఇది 1991లో మనం తాకట్టు పెట్టిన విలువ కంటే 178 రెట్లు ఎక్కువ. ఇదే విషయమై ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఒక ముఖ్యమైన పిలుపునిచ్చారు. విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడి తగ్గించడానికి, రూపాయి విలువను కాపాడటానికి కనీసం ఒక సంవత్సరం పాటు అనవసరమైన బంగారు కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని, ఇంధన వాడకాన్ని తగ్గించాలని కోరారు. ఇలా బంగారం కొనుగోలు చేయడం, ఇంధనాన్ని ఆదా చేయడం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. తద్వారా ద్రవ్యోల్భణం పెరగకుండా చూసుకోవచ్చు. రూపాయి విలువ పడిపోకుండా జాగ్రత్త పడొచ్చు.
1960లలో మొరార్జీ దేశాయ్ తెచ్చిన గోల్డ్ కంట్రోల్ యాక్ట్ నుంచి, 1991 నాటి తాకట్టు కథ వరకు భారతీయులకు బంగారంతో ఉన్న బంధం ఆర్థికంగా ఎంతో బలమైనది. నాడు 47 వేల కిలోల బంగారాన్ని దేశం దాటించిన ఆర్‌బీఐ, నేడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కేంద్ర బ్యాంకులలో ఒకటిగా నిలిచింది. గతాన్ని గుర్తుంచుకుని, ప్రస్తుత అంతర్జాతీయ యుద్ధాల నేపథ్యంలో ఆర్థికంగా క్రమశిక్షణతో మెలగడమే నేటి దేశ పౌరుడిగా మనం చేయాల్సిన పని. మన పనిని సమర్థవంతంగా నిర్వహిస్తే...దేశం బాగుంటుంది...దేశ భవిష్యత్తు బాగుంటుంది.




