Delhi: దిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

Delhi: దిల్లీలోని సీమపురి ప్రాంతంలో ఐదు అంతస్తుల భవనం కుప్పకూలడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు.

Arun Chilukuri
Published on: 7 Oct 2026 5:35 PM IST
Delhi: దిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐదంతస్తుల భవనం
X

Delhi: దిల్లీలో మరో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈశాన్య దిల్లీలోని సీమపురి ప్రాంతంలో ఐదు అంతస్తుల భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సత్యనికేతన్‌లో జరిగిన హాస్టల్ విషాదం జరిగిన నెల రోజుల వ్యవధిలోనే ఈ ఘటన పునరావృతం కావడం తీవ్ర కలకలం రేపింది.

బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు భవనం కూలినట్లు దిల్లీ ఫైర్ సర్వీస్ (DFS) డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందడంతో.. వెంటనే అగ్నిమాపక యంత్రాలు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

ప్రస్తుతం శిథిలాల తొలగింపు మరియు గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. స్థానికులు కూడా సహాయక చర్యల్లో భాగస్వామ్యులై, తమ చేతులతోనే రాళ్ల బండలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

నిన్న రాత్రి ఉత్తరాఖండ్‌లో సంభవించిన భూకంపం ధాటికి దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో భూమి కంపించడంతో, ఈ భవనానికి పగుళ్లు ఏర్పడ్డాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే, ప్రమాదానికి అసలు కారణం విచారణ తర్వాతే తేలుతుందని అధికారులు తెలిపారు.

సహాయక వాహనాలు, అంబులెన్స్‌లు వేగంగా వెళ్లేందుకు వీలుగా సీమపురి గోల్ చక్కర్, డీఎల్‌ఎఫ్ భోపుర తదితర మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. ఆ వైపు వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని దిల్లీ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.