8th Pay commission: కనీసం రూ. 69 వేల జీతం, ప్రతీ ఏటా 6 శాతం హైక్.. 8వ వేతన సంఘంతో..!
8th Pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లలో పెద్ద మార్పులు రావచ్చని సంకేతాలు కనిపిస్తున్నాయి.
8th Pay commission
8th Pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లలో పెద్ద మార్పులు రావచ్చని సంకేతాలు కనిపిస్తున్నాయి. 8వ వేతన సంఘానికి ఉద్యోగ సంఘాల సమాఖ్య తమ సూచనలను సమర్పించింది. జీవన వ్యయం పెరగడం, కుటుంబ అవసరాలు మారడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదనలు ఇచ్చారు.
కనీస జీతం భారీ పెంపు రూ. 69,000 ప్రతిపాదన
ఈ ప్రతిపాదనలో ముఖ్యంగా కనీస బేసిక్ జీతాన్ని ప్రస్తుతం ఉన్న రూ. 18,000 నుంచి నేరుగా రూ. 69,000కు పెంచాలని సూచించారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.83గా నిర్ణయించాలని కోరుతున్నారు. దీని వల్ల ప్రస్తుత జీతాలు, పింఛన్లు గణనీయంగా పెరుగుతాయి. ఈ మార్పులను 2026 జనవరి 1 నుంచి అమలు చేయాలని స్పష్టం చేశారు
అలాగే, ప్రతి సంవత్సరం 6% జీత పెంపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది ప్రస్తుతం ఉన్న రేటు కంటే ఎక్కువ.
పే స్ట్రక్చర్‌లో పెద్ద మార్పులు
ప్రస్తుతం ఉన్న 7వ వేతన సంఘంలోని 18 పే లెవల్స్‌ను తగ్గించి కేవలం 7 లెవల్స్‌గా మార్చాలని సూచించారు.
దీని ద్వారా ప్రమోషన్లు త్వరగా రావడం, కెరీర్‌లో నిలిచిపోవడం తగ్గడం వంటి లాభాలు ఉంటాయి. కొత్త లెక్కల ప్రకారం కనీస స్థాయి జీతం రూ. 69,000కి పెరుగుతుంది. తదుపరి స్థాయిలు రూ. 83,200 నుంచి రూ. 1.12 లక్షలకు, మధ్యస్థాయి ఉద్యోగులకు రూ. 1.35 లక్షల నుంచి రూ. 2.15 లక్షల వరకు పెరుగుతుంది. మొత్తం పే సిస్టమ్‌ను సరళంగా, స్పష్టంగా మార్చాలని లక్ష్యం.
పింఛన్, ప్రమోషన్లు, ఉద్యోగ భద్రత
ఈ ప్రతిపాదనలో పింఛన్ అంశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. పాత పింఛన్ పథకం (OPS) మళ్లీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చివరి జీతంలో 67% పింఛన్‌గా ఇవ్వాలి. కుటుంబ పింఛన్ 50 శాతంగా ఉండాలి. ఇంకా ప్రతి ఉద్యోగికి 30 సంవత్సరాల్లో కనీసం 5 ప్రమోషన్లు లేదా ఫైనాన్షియల్ అప్‌గ్రేడ్స్ ఇవ్వాలి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పింఛన్ రివిజన్ చేయాలి.
అలవెన్సులు, సామాజిక భద్రతలో మెరుగులు
ఉద్యోగుల సౌకర్యాల కోసం కూడా కీలక సూచనలు చేశారు. వీటిలో ప్రధానంగా.. హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) కనీసం 30% వరకు పెంచాలనే డిమాండ్ ఉంది. అదే విధంగా మెట్రో నగరాల్లో ఇంకా ఎక్కువగా ఉండాలి, ఇన్సూరెన్స్ కవరేజ్ పెంపు, విధుల్లో మరణిస్తే ఎక్కువ పరిహారం చెల్లించాలని అంటున్నారు. లీవ్ ఎంకాష్‌మెంట్ పరిమితులు తొలగించాలని, మేటర్నిటీ లీవ్‌లను 240 రోజులకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటు
కొత్తగా “పేరెంట్ కేర్ లీవ్”, ఎక్కువ పేటర్నిటీ లీవ్ ఇవ్వాలని అంటున్నారు. ఈ ప్రతిపాదనలు ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు మాత్రమే. తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. ఈ సూచనల్లో కొంతైనా అమలైతే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, సదుపాయాల్లో పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉంది.




