పునర్విభజనపై పొలిటికల్ హీట్.. నెట్టింట దీప్కే లెక్కలు వైరల్.!

మహిళా రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపజేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది.

G Krishna
Published on: 28 Nov 2026 12:36 PM IST
Abhijeet Dipke
X

Abhijeet Dipke

మహిళా రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపజేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల మంది ఎంపీల మద్దతు కూడగట్టే దిశగా అనేక ప్రతిపక్ష పార్టీలతో సానుకూల చర్చలు జరిగినట్లు సమాచారం. నవంబర్ 30 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ, ఈ బిల్లుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్, అందులోని లెక్కలు ఇప్పుడు నెట్టింట ఆసక్తికరంగా మారాయి. డీలిమిటేషన్

బిల్లు ఆమోదం పొందితే కొత్త ఓట్లు రాకపోయినా బీజేపీకి సీట్ల పరంగా ఎలాంటి లాభం చేకూరుతుందో ఆయన ఒక ఉదాహరణ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు.

ఓటర్లు మారకపోయినా ఫలితాలు ఎలా మారతాయన్న లెక్క

అభిజిత్ దీప్కే ఎక్స్ (X) వేదికగా స్పందిస్తూ.. ఒక నియోజకవర్గంలో 1,000 మంది ఓటర్లు ఉన్నారని భావిస్తే, అందులో 400 ఓట్లు బీజేపీకి, 600 ఓట్లు విపక్షానికి వస్తాయని అనుకుందాం. అప్పుడు ఆ ఒక్క సీటు విపక్షానికి దక్కుతుంది. అయితే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆ 1,000 ఓటర్లను 500 చొప్పున రెండు నియోజకవర్గాలుగా విభజిస్తే ఫలితం మారుతుందని ఆయన పేర్కొన్నారు. మొదటి సీటులో బీజేపీకి 260, విపక్షానికి 240 ఓట్లు వస్తే అక్కడ బీజేపీ గెలుస్తుందని, రెండో సీటులో బీజేపీకి 140, విపక్షానికి 360 ఓట్లు వస్తే అక్కడ విపక్షం గెలుస్తుందని ఆయన లెక్క కట్టారు. ఓటర్లు వారే అయినా, ఓటు వేసే తీరు మారకపోయినా, నియోజకవర్గ సరిహద్దులు మారడం వల్ల గతంలో సీటు లేని చోట కూడా బీజేపీకి కొత్త సీటు దక్కే అవకాశం ఉందని ఆయన విశ్లేషించారు. అందుకే కొందరు విపక్ష నేతలు తమ ప్రస్తుత స్థితిని కాపాడుకునే ఆలోచనతో దీనిని సమర్థిస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు.

విపక్ష కూటమిలో భిన్న స్వరాలు.. మద్దతుకు సిద్ధమవుతున్న పార్టీలు

మరోవైపు, పునర్విభజన బిల్లు విషయంలో విపక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ఎన్సీపీ-ఎస్పీ (NCP-SP) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే శనివారం జరగనున్న 'ఇండియా' కూటమి సమావేశానికి హాజరుకాబోనని స్పష్టం చేయగా, తమ పార్టీ పునర్విభజనకు మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నేత జితేంద్ర ఆవ్హాద్ వెల్లడించారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బిల్లుకు మద్దతు ప్రకటించింది. బీజేడీ ఎంపీ సంత్‌రుప్త మిశ్రా సైతం మహిళా రిజర్వేషన్లకు తమ మద్దతును పునరుద్ఘాటించారు.

లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు.. కేబినెట్ ఆమోదం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల సంఖ్యను 50 శాతం పెంచే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు. రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న లోక్‌సభ ప్రాతినిధ్య నిష్పత్తిని యథాతథంగా కొనసాగిస్తూనే ఈ పెంపు చేపడతారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లలో 50 శాతం పెరుగుదలతో మొత్తం సీట్ల సంఖ్య 850కి చేరుకుంటుందని, ఇందులో 35 సీట్లు కేంద్రపాలిత ప్రాంతాలకు ఉంటాయని సమాచారం. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.